Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా పోరులో ముందు..
- రక్షణ పరికరాల్లేవ్.. వేతనాల్లేవ్ ! : ఎన్హెచ్ఆర్సీ
న్యూఢిల్లీ: గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో ఆశా కార్మికులు కీలక పాత్ర పోషిస్తారు. మరీ ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి సంక్షోభ నేపథ్యంలోనూ తమ సేవలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే, ఆశా కార్యకర్తల పని పరిస్థితులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు సైతం జారీ చేసింది. ఆశా కార్మికులు పనిచేయడానికి దారుణమైన పరిస్థితులు ఉన్నాయనీ, వారి వేతన బకాయిలు పెరుగుతుండటంతో పాటు కరోనా పోరులో ముందుకు సాగుతున్న వారికి రక్షణ పరికరాలు సైతం లేవని ఆరోపణలతో పాటు తమకు నివేదికలు సైతం అందుతున్నాయని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. ఈ ఆరోపణలు వాస్తవమైతే ఆశా కార్మికులపై ఆధారపడి ఉన్న భారత గ్రామీణ ఆరోగ్య నిర్వహణ వ్యవస్థ చాలా కీలకమైన సమస్యలను లేవనెత్తుతుందని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది.
''దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలోనూ ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్నప్పటికీ ఆశా కార్మికులు తమ వేతన బకాయిలు, రక్షణ పరికరాలను పొందడం లేదని చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసకున్నామని'' ఎన్హెచ్ఆర్సీ మంగళవారం తెలిపింది. దీని ప్రకారం ఫిర్యాదులో లేవనెత్తిన అంశాలపై తమ నివేదికలను ఆరు వారాల్లోగా సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నోటీసులు సైతం జారీ చేసినట్టు పేర్కొంది.
ప్రతి రాష్ట్రంలో ఎంతమంది ఆశా కార్మికులు పనిచేస్తున్నారు? మహమ్మారి సమయంలో వారికి చెల్లించిన పారితోషికం, ఇతర బకాయిలు, వారి వృత్తిపరమైన విధులను నిర్వహించడానికి వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య సంరక్షణ చర్యలు వంటి పూర్తి వివరాలు అందజేయాలని తెలిపింది. వీటితో పాటు ఆశాలు, వారి కుటుంబాలకు అందించే సౌకర్యాలు, విధులను నిర్వర్తించే సమయంలో మరణిస్తే ఇచ్చే పరిహారం, దీర్ఘకాలిక ఆరోగ్య బీమా/రక్షణ, సామాజిక భద్రత/రక్షణ సౌకర్యాలు కూడా ఈ నివేదికల్లో చేర్చాలని ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది.