Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రసవత్తరంగా సీబీఐ చీఫ్ ఎంపిక
- ఆరు నెలల్లోపు సర్వీసున్నవారికి సీజేఐ నో
న్యూఢిల్లీ : సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను నియమితులయ్యారు. ఈమేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. రెండేండ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1985 మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎల్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ డీజీగా పనిచేస్తున్నారు.
అంతకు ముందు సీబీఐ చీఫ్ ఎంపిక రసవత్తరంగా జరిగినట్టు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఎంపిక కమిటీ భేటీ అయింది. ప్రధాని అధికారిక నివాసంలో ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. సీబీఐ చీఫ్ ఎంపిక నిమిత్తమై మోడీ సర్కార్ రూపొందించిన సీనియర్ ఐపీఎస్‌ల జాబితాలో బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ ఆస్తానా, ఎన్ఐఏ చీఫ్ వై.సి.మోడీల పేర్లున్నాయి. రాకేశ్ ఆస్తానా ఈ ఏడాది జులై 31న, వై.సి.మోడీ మే 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. వీరి సర్వీస్ 6నెలలు కూడా లేదనీ, ఇలాంటివారి పేర్లను అసలు పరిశీలనలోకే తీసుకోకూడదని సీజేఐ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారట. సీజేఐ అభిప్రాయాన్ని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అధీర్ రంజన్ చౌధరీ బలపర్చారని తెలిసింది. దాంతో ఆ ఇద్దరు అధికారుల పేర్లను కేంద్రం పక్కనపెట్టాల్సి వచ్చిందట. సీఐఎస్ఎఫ్ డీజీ సుబోధ్ కుమార్ జైశ్వాల్, 'సశస్త్ర సీమా బల్' డీజీ కె.ఆర్.చంద్ర, హోంశాఖ స్పెషల్ సెక్రటరీ వి.ఎస్.కె.కౌముదీల పేర్లతో తుదిజాబితా రూపొందిందని సమాచారం. ఈ ముగ్గురిలో సుబోధ్ కుమార్ జైశ్వాల్ అత్యంత సీనియర్ అధికారి. ఇక ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ సీబీఐ చీఫ్ ఎంపికకు సంబంధించి కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు మే 11న 109 పేర్లు పంపారని, ఆ తర్వాత జాబితాలో పేర్లను 16కు కుదించారని, కమిటీ సమావేశానికి కొద్ది గంటల ముందు పేర్ల సంఖ్య 6కు తగ్గిందని ఆయన విమర్శించారు. కేంద్ర సిబ్బంది, శిక్షణా శాఖ వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం, ప్రధాని, సీజేఐ, ప్రతిపక్ష నేత నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ సీబీఐ చీఫ్‌ను ఎంపికచేయాలి. సీనియారిటీ, నిబద్ధత, అవినీతి వ్యతిరేక కేసుల దర్యాప్తులో అనుభవం...ప్రాతిపదికగా ప్రధాని నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ సీబీఐ చీఫ్‌ను ఎంపికచేయాల్సి వుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ చీఫ్ పోస్టు ఖాళీ అయ్యింది. అప్పటివరకూ డైరెక్టర్‌గా ఉన్న ఆర్.కె.శుక్లా ఉద్యోగ విరమణ చేశారు. అప్పట్నుంచీ సీబీఐ అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా కు తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పారు.