Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ సరిహద్దులకు తరలివస్తున్న రైతులు
- ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు
న్యూఢిల్లీ : కేంద్రం అప్రజాస్వామ్యపద్ధతిలో ఆమోదించు కున్న నల్లచట్టాలను రద్దుచేయాలంటూ అన్నదాతలు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. బుధవారం తలపెట్టిన బ్లాక్ డేకు ఢిల్లీ సరిహద్దులకు వేలాదిగా రైతులు తరలివస్తున్నారు. ప్రజాసంఘాలు,రాజకీయపార్టీలు మద్దతు తెలిపాయి. కాగా మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై బుధవారానికి ఆరు నెలలు కావొస్తుంది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల పట్ల మోడీ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా మే 26న ''బ్లాక్ డే'' నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇండ్లపైన, కార్యాలయాలపైన, వాహనాలకు నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని కోరింది.
అయితే సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునకు అపూర్వ మద్దతు లభించింది. ప్రజా సంఘాల నుంచి రాజకీయ పార్టీల వరకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభించింది. సీఐటీయూ, ఐఏన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీ యూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పిఎఫ్, యూటీయూసీ వంటి పది జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా మద్దతు తెలిపాయి. ఏఐకేఎస్, (ఏఐకేఎస్-అజరు భవన్), ఏఐకేఎం, ఏఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ, ఏఐఎఆర్ఎల్ఏ వంటి ఆరు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎంఎం వంటి ప్రజా సంఘాలు బ్లాక్ డేకు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్సీపీ, ఆర్జేడీ, ఎస్పీ, టీఎంసీ, శివసేన, జేడీఎస్, జేఎంఎం, జేకేపీఏ, ఆప్ తదితర పార్టీలు సంయుక్త కిసాన్ మోర్చా బ్లాక్ డే పిలుపుకు మద్దతు ఇచ్చాయి.
ఇప్పటికే బ్లాక్ డేకి మద్దతుగా ఆన్లైన్ లో విస్తృత ప్రచారం జరిగింది. ట్విట్టర్, ఫేస్బుక్ సమాజిక మాధ్యమాల్లో యువత ప్రచారం నిర్వహించారు. కరోనా రెండో దశ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రచార శైలిని మార్చారు. అందుకే ఆన్లైన్ లో ప్రచారాన్ని చేపట్టారు. ఇప్పటికే బ్లాక్ డే పిలుపు ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేరుకుంది. బుధవారం జరిగే నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా వేలాది ప్రాంతాల్లో లక్షలాది మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజలు భాగస్వామ్యం కానున్నారు. ఆ రకంగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన ప్రాంతాలకు వేలాది నల్ల జెండాలు చేరుకున్నాయి. పంజాబ్లో గ్రామాలకు గ్రామాల్లో మహిళలు నల్ల జెండాలను కుట్టి ఢిల్లీ సరిహద్దులకు పంపారు. కొన్ని గ్రామాల నుంచి వెయ్యికి తక్కువ లేకుండా నల్ల జెండాలు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నాయి. అలాగే హర్యానా నుంచి కూడా నల్ల జెండాలు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నాయి. ఆయా సరిహద్దుల్లో వేదికల వద్ద రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేతలు నల్ల జెండాలను ఎగురవేస్తారు.
మే 26 బ్లాక్ డే నిరసనలో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ ఆందోళన ప్రాంతాలకు చేరుకున్నారు. వీరిలో అధిక భాగం మహిళ రైతులు ఉన్నారు. వీరి రాకతో ఆందోళన ప్రాంతాల్లో రైతులు సమీకరణ భారీగా పెరిగింది.
రైతులకు మద్దతుగా నల్లజెండా
ఎగరేసిన నవజ్వోత్ సింగ్ సిద్ధూ
పంజాబ్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాటియాలా, అమత్సర్లలో తన నివాసాలపై మంగళవారం నాడు నల్లజెండాలను ఎగురవేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ సమస్య పరిష్కారానికి కేంద్రం అనుసరిస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా ఆయన ఈ నల్లజెండాను ఎగురవేశారు. ప్రతి ఒక్కరూ నల్ల జెండాలను ఎగురవేసి రైతులకు సంఘీభావం తెలపాలని సిద్ధూ కోరారు. నల్ల చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ ప్రత్యామ్నాయం చూపించడం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సేకరణకు భరోసా కల్పించడం చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతవరకూ రైతులకు సంఘీభావం తెలుపుతూనే ఉంటామన్నారు.
రైతులకు రైల్వే ఉద్యోగుల మద్దతు
రైతులకు రైల్వే ఉద్యోగులు మద్దతు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రైల్వే ఉద్యోగుల సంఘం ప్రకటించింది. రైతుల బ్లాక్ డేకు సంఘీభావంగా మోడీ ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు పిలుపు ఇచ్చారు. పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని, కరోనా భీమా కల్పించాలనీ, ప్రయివేటీకరణ ఆపాలనీ, పెండింగ్ డీఏ చెల్లించాలని డిమాండ్ల సాధనకై ఉద్యమించాలని కోరారు.
మూడు రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
రైతులు ధర్నా చేస్తున్న ప్రదేశాల్లో కోవిడ్-19 వ్యాపించకుండా నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) మూడు రాష్ట్రాలను ఆదేశించింది. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రంగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన మార్గదర్శకాలను నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న రైతులు పాటించడం లేదని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నది. దీనిపై విచారణకు చేపట్టిన ఎన్హెచ్ఆర్సీ మంగళవారం ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రదేశాల వద్ద కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరింది. నాలుగు వారాల్లోగా నివేదికలను సమర్పించాలని కోరింది.