Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎం-కేర్స్ కింద నాణ్యతలేనివి పంపిన మోడీ సర్కార్
- కేంద్రాన్ని వివరణ కోరిన బాంబే హైకోర్టు
న్యూఢిల్లీ : పీఎం-కేర్స్ కింద కేంద్రం పంపిన వెంటిలేటర్లు సరిగా పనిచేయటం లేదని వివిధ రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కరోనా ఉధృతి అధికంగా ఉన్న మహారాష్ట్రలో మరట్వాడా ప్రాంతంలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్‌కు కేంద్రం నుంచి వెంటిలేటర్లు అందాయి. ఇవన్నీ కూడా సరిగా పనిచేయటం లేదని, వీటిలో సాంకేతిక లోపాలున్నాయని వైద్యులు గుర్తించి పక్కకు పెట్టారట. దీనిపై స్థానిక పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల్ని సుమోటాగా స్వీకరించిన బాంబే హైకోర్టు, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. 'సమస్య మీ దృష్టికి వచ్చిందా? దీనికి పరిష్కారం ఏంటి' అని కేంద్రాన్ని వివరణ కోరింది. మరట్వాడా ప్రాంతంలోని వివిధ హాస్పిటల్స్‌కు కేంద్రం నుంచి దాదాపు 150 వెంటిలేటర్లు రాగా, ఇందులో 113 పనిచేయటం లేదని, లోపభూయిష్టంగా ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. జస్టిస్ రవీంద్ర వి.గాగే, జస్టిస్ బాల్‌చంద్ర యు.దిబాద్వార్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ప్రాంతంలో తలెత్తిన సమస్యపై వెంటనే దృష్టిసారించి, తగిన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది.
'' పీఎం కేర్స్ కింద కేంద్రం పంపిన వాటిల్లో 113 వెంటిలేటర్లు నాణ్యతలేనివని తేలిపోయింది. వీటిని పొందిన ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్ పక్కకు పడేశాయి. మిగతా 37 వెంటిలేటర్ల బాక్స్‌లను ఇంకా బయటకు తీయలేదు. అవి పనిచేస్తాయని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరికరాలు పంపితే..ఇక్కడి రోగులకు మెరుగైన సేవలు అందుతాయా? మీరు పంపిన వెంటిలేటర్ బాక్స్‌లు వెనక్కి తీసుకొని, నాణ్యమైన వెంటిలేటర్లను పంపండి'' అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారిబారిన పడిన వారిని కాపాడటంలో అత్యంత కీలకమైనవి వెంటిలేటర్లు. లోపాలున్న వాటిని కేంద్రం ఎలా స్వీకరించింది? వాటిని వివిధ హాస్పిటల్స్‌కు ఎలా పంపారు? అన్నది కేంద్రం స్వీయ పరిశీలన చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. మహారాష్ట్రలోనే కాదు జార్ఖండ్‌కు పంపిన వెంటిలేటర్లు కూడా పనిచేయటం లేదని ఫిర్యాదులు అందాయి. వాటిపై వార్తా కథనాలు కూడా వెలువడ్డాయి.