Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.58 లక్షల కోట్ల అప్పుపై దృష్టి
న్యూఢిల్లీ : కరోనా రెండో దశ సంక్షోభంతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకోవడంతో వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రూ.1.58 లక్షల కోట్లు అదనపు అప్పు చేయాల్సి వస్తున్నదని లీకులు వస్తున్నాయి.. శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనున్నది. ఇందులో పలు రాష్ట్రాలు తమకు కేంద్రం నుంచి రావాల్సిన నష్ట పరిహారంపై ప్రశ్నించే అవకాశం ఉన్నది. రాష్ట్రాలకు కేంద్రం రూ.2.7 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉన్నదని అంచనా. కాగా కేంద్ర వద్ద రూ.1.1 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని సమాచారం. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం జీఎస్టీ ప్రవేశపెట్టిన సమయంలో రాష్ట్రాల ఆదాయం తగ్గితే పరిహారం తాము చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా, లాక్డౌన్ నిబంధనలతో పన్ను వసూళ్లు తగ్గిపోయాయి. వరుసగా ఏడు మాసాల నుంచి జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లకు పరిమితమవుతూ వస్తున్నాయి.