Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనారోగ్యంపాలైన హెల్త్ వర్కర్లకు పథకం వర్తించదు : వైద్యనిపుణులు
- కోవిడ్‌తో చనిపోయినవారిలో 0.013శాతం మందికి బీమా సొమ్ము
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ముందుండి పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు మోడీ సర్కార్ ప్రకటించిన బీమా పథకం లోపభూయిష్టంగా ఉందని, పథకం ప్రయోజనం అత్యల్పమని వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. గత ఏడాది మార్చి 27న 'పీఎం గరీబ్ కల్యాణ్ బీమా' పథకాన్ని ప్రకటించింది. కోవిడ్ కారణంగా హెల్త్ వర్కర్ చనిపోతే, అతడి కుటుంబానికి రూ.50లక్షలు చెల్లించటమే ఈ బీమా పథకం ముఖ్య ప్రయోజనం. దేశంలోని దాదాపు 22 లక్షలమంది హెల్త్ వర్కర్లకు ఈ బీమా పథకం వర్తిస్తుందని కేంద్రం చెబుతోంది. అయితే ఈ పథకం ప్రయోజనం చాలా పరిమితమని, కేవలం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ హాస్పిటల్స్‌లో పనిచేసేవారికే బీమా వర్తిస్తోందని విమర్శలున్నాయి.
పీహెచ్సీ సెంటర్లు, ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్ (నాన్ కోవిడ్)లలో పనిచేసే సిబ్బందికి ఈ బీమా వర్తించదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేగాక కరోనా రోగులకు చికిత్స అందిస్తూ లక్షలాది మంది వైద్య సిబ్బంది అనారోగ్యం బారిన పడుతున్నారని, ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారని ...వీటికి బీమా కవరేజీ లేకపోవటం పథకంలో ప్రధాన లోపమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ సోకి చనిపోయినా, కోవిడ్ విధుల్లో భాగంగా ప్రమాదవశాత్తు చనిపోయిన హెల్త్ వర్కర్ కుటుంబానికి బీమా సొమ్ము రూ.50లక్షలు అందజేయాలి. బాధిత కుటుంబం బీమా సొమ్ముకు క్లెయిమ్ చేసుకున్నప్పుడు మృతుడు కోవిడ్ కారణంగానే చనిపోయాడని ల్యాబ్ రిపోర్టు ఉండాలి. కోవిడ్ హాస్పిటల్ వైద్యాధికారులు కూడా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. బాధిత కుటుంబ సభ్యులకు ఈ రెండు సర్టిఫికెట్లు పొందటం చాలా కష్టంగా మారిందని సమాచారం. దాంతో పెద్ద సంఖ్యలో బీమా క్లెయిమ్స్ తిరస్కరణకు గురవుతున్నాయని తేలింది. ఇప్పటివరకూ కోవిడ్ విధుల వల్ల మరణించిన హెల్త్ వర్కర్లో కేవలం 0.013శాతం మందికి మాత్రమే బీమా సొమ్ము అందిందని గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి బీమా పథకం ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చునని వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.