Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-గళమెత్తిన భారతవని
- ఢిల్లీ నుంచి గల్లీ వరకు నల్ల జెండాలతో నిరసన.. పలుచోట్ల మోడీ దిష్టి బొమ్మల దహనం
- 'బ్లాక్ డే' సక్సెస్ : రైతు, కార్మిక, ప్రజాసంఘాలు
న్యూఢిల్లీ : ఆరునెలలు కాదు..ఎన్ని నెలలైనా వెనక్కితగ్గమని రైతులు ప్రతిజ్ఞ చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలమంది రైతులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై బుధవారం నాటికి ఆరునెలలైంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి ఏడేండ్లు అయింది. ఈ సందర్భంగా 'బ్లాక్ డే' గా నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నల్ల జెండాలతో నిరసనలు హోరెత్తాయి. ఇండ్లపైన, కార్యాలయాలపైన, వాహనాలకు నల్ల జెండాలు ఎగురవేసి నిరసనలు తెలిపారు. నల్ల రిబ్బన్లు పెట్టుకొని, ఆందోళనలు చేపట్టారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఎస్కేఎం 'బ్లాక్ డే' పిలుపునకు కార్మిక, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, యువజన, మహిళ, దళిత, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. రైతులతో పాటు ఆయా సంఘాల కార్యకర్తలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. బ్లాక్ డే సక్సెస్ అయిందని రైతు, కార్మిక, ప్రజా, సంఘాలు ప్రకటిం చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, ఢిల్లీ, త్రిపుర, అసోం, ఉత్తరాఖండ్, జార్ఖండ్, గుజరాత్, పుదుచ్చేరి, బీహార్, గోవా, లక్షదీప్ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ''బ్లాక్ డే'' సంపూర్ణంగా జరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. యాస్ తుఫాను అతలాకుతలం చేసినప్పటికీ ఒడిశా, పశ్చిమ బెంగాల్లో బ్లాక్ డే నిరసనలు జరిగాయి. దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.
ఢిల్లీ సరిహద్దుల్లో ''బ్లాక్ డే''
ఢిల్లీ సరిహద్దులు సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్పూర్, పల్వాల్ బోర్డర్లో ''బ్లాక్ డే'' సంపూర్ణంగా జరిగింది. టాక్టర్స్, ట్రాలీలు, గుడారాలపై నల్ల జెండాలు ఎగురవేస్తూ, మోడీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ప్రజలు తమ ఇండ్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై నల్ల జెండాలు ఎగురవేసి రైతులకు సంఘీభావం చెప్పారు. సింఘూ బోర్డర్లో తమ గుడారాలు, ట్రాలీలు, కార్లు, ట్రాక్టర్లు, తాత్కాలిక నిర్మాణాలపై నల్ల జెండాలను ఎగురవేశారు. అనేక ప్రదేశాల్లో మోడీ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి, వాటిని దహనం చేశారు. బ్లాక్ డే పిలుపు నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. బ్లాక్ డేను విజయవంతం చేసినందుకు రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు సంయుక్త కిసాన్ మోర్చా ధన్యవాదాలు తెలిపింది.
డిమాండ్లన్నీ నెరవేరేవరకూ ఉద్యమం కొనసాగిస్తాం :ఎస్కేఎం
దేశవ్యాప్తంగా ప్రజలు రైతులకు సంఘీభావం తెలుపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్, యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్, అభిమన్యు కోహాద్ పేర్కొన్నారు. డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు రైతులు ఆందోళన నుంచి వెనక్కి తగ్గరని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
ఉద్యమానికి మద్దతుగా పలు హ్యాష్ట్యాగ్లు బుధవారం ఉదయం నుండే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో ట్రెండింగ్ అయ్యాయి.
ఏఐకేఎస్ కార్యాలయంలో నిరసనలు
ఢిల్లీలోని ఏఐకేఎస్ కార్యాలయంలో నల్ల జెండాలు ప్రదర్శించి, మోడీ దిష్టి బొమ్మను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా, సంయుక్త కార్యదర్శి విజూ కృష్ణన్, ఆర్థిక కార్యదర్శి పి.కృష్ణ ప్రసాద్, సీఐటీయూ కార్యదర్శి ఎ.ఆర్.సింధు, ఏఐఏడబ్ల్యూయూ సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, సహాయ కార్యదర్శి ఆశా శర్మ, కేంద్ర కమిటీ సభ్యురాలు మెమునా మొల్లా, అర్చన ప్రసాద్, ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి ధనిత్ ధెంటా, పీఎస్ఎం నాయకుడు దినేష్ అబ్రోల్ తదితరులు పాల్గొన్నారు.
నల్ల జెండాలతో సీపీఐ నేతల నిరసన
సీపీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆధ్వర్యాన నల్ల జెండాలతో నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, రైతులతో చర్చలు పున్ణప్రారంభించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అనీరాజా, జాతీయ సమితి సభ్యులు అనిల్ రాజిమ్వాలే, కృష్ణ ఝా, డాక్టర్ ఎ.ఎ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఎంతకాలమైనా ఆందోళనలు కొనసాగిస్తామని రైతు నేత రాకేశ్ తికాయత్ అన్నారు. మూడు సాగు చట్టాలను రద్దు చేసి, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడటమన్నదే తమ ఏకైక డిమాండ్ తెలిపారు. ఆ డిమాండ్ నెరవేరే వరకూ ఎంతకాలమైనా సరే నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద రైతులు 'బ్లాక్ డే' పాటించారు.