Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఏడు రాష్ట్రాల డిమాండ్
న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను(జీఎస్టీ) చట్టంలోని నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన జీఎస్టీ పరిహారం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏడు బీజేపీయేతర పాలక రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి శాంతి ధరివాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, పలు ఇతర ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న ఏడు రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు గురువారం భేటీ అయ్యారు. జీఎస్టీ బకాయిల విడుదలతో పాటు అదనపు రుణ పరిమితిని జీఎస్డీపీలో 5 శాతానికి పెంచాలని ఆయా రాష్ట్ర పభ్రుత్వాలు డిమాండ్ చేశాయి. అదేవిధంగా కోవిడ్-19 పోరుకు సంబంధించి కొనుగోలు చేసే వైద్య, ఇతర పరికరాలపై విధిస్తున్న పన్నులను రద్దు చేయాలని కోరాయి. రాజస్థాన్ ప్రభుత్వం తరపున సమావేశానికి హాజరైన మంత్రి ధరివాల్ మాట్లాడుతూ సమస్యల విషయంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఐక్యంగా ఉండి, రేపు(శుక్రవారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్యక్షతన జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాటిని లేవనెత్తాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ సహకార స్ఫూర్తిని గౌరవించి తక్షణం రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ రెవెన్యూ నష్టాలకు పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.