Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లాక్డే విజయవంతంపై ఏఐకేఎస్
న్యూఢిల్లీ: గత ఆరు నెలలుగా సాగుతున్న రైతాంగ ఉద్యమం పట్ల కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న క్రూరమైన, అమానవీయ వైఖరికి నిరసనగా బుధవారం నిర్వహించిన నిరసన దినం(బ్లాక్డే)లో లక్షలాదిగా పాల్గొని, విజయవంతం చేసినందుకు ఆలిండియా కిసాన్ సభ( ఏఐకేఎస్) దేశ ప్రజలకు అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మోడీ పాలనకు ముగింపు పలకాలన్న గట్టి సంకల్పం ఈ అపూర్వమైన స్పందనలో ప్రతిభింభించిందని పేర్కొంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమం ప్రారంభమై బుధవారం(మే26)తో ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపు మేరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి గౌహతి వరకు దేశవ్యాప్తంగా వేలాది ప్రాంతాల్లో ఈ బ్లాక్డే నిర్వహించారు. రైతుల పట్ల మోడీ సర్కార్ వైఖరిని నిరసిస్తూ అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు నల్లజెండాలు ప్రదర్శించారు. పలు ప్రాంతాల్లో మోడీ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. ఎస్కేఎం ఇచ్చిన ఈ పిలుపునకు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక, 12 ప్రధాన పత్రిపక్ష పార్టీలతో పాటు అనేక వ్యవసాయ కార్మిక,విద్యార్థి, యువజన, మహిళా, చిన్న ఉత్పత్తిదారుల సంఘాలు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులు, మేధావులు, తదితర వర్గాల ప్రజలు మద్దతు పలికారు. బ్లాక్డే పిలుపునకు వచ్చిన స్పందన మోడీ సర్కార్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ప్రస్పుటం చేస్తోందని ఏఐకేఎస్ తన ప్రకటనలో తెలిపింది. మోడీ సర్కార్ తన కార్పొరేట్ అనుకూల, నయా ఉదారవాద విధానాలకు ముగింపు పలకాలని రైతులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాలను మార్చుకోకుంటే.. తమ పోరాటాన్ని ఐక్యంగా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సంకల్పిస్తుందనీ, ఎస్కేఎం త్వరలో ఉద్యమ భవిష్యత్తు తీరుపై నిర్ణయం తీసుఉంటుందని ఎఐకెఎస్ పేర్కొంది.