Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గూగుల్ సిఇఓ సుందర్ పిచారు
న్యూఢిల్లీ : దేశమేదైనా అక్కడి స్థానిక చట్టాలకు గూగుల్ కట్టుబడి ఉంటుందని ఆ సంస్థ సిఇఓ సుందర్ పిచారు స్పష్టం చేశారు. గురువారం ఎంపిక చేసిన ఆసియా ఫసిఫిక్ విలేకరులతో జరిగిన వర్చువల్ సమావేశంలో సుందర్ పిచారు ఈ వ్యాఖ్యలు చేశారు. వేగంగా అభివద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా రూపొందించే రెగ్యులేటరీ విధానాల్లో స్థానిక ప్రభుత్వాలతో గూగుల్ కలిసి పనిచేస్తుందని పిచారు తెలిపారు. 'మేం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి దేశంలో అక్కడి స్థానిక చట్టాలను పూర్తిగా గౌరవిస్తాం. నిర్మాణాత్మకగా పనిచేస్తాం. మా నివేదికలన్నీ పారదర్శకంగా ఉంటాయి. ప్రభుత్వ అభ్యర్థనలకు అనుగుణంగా చేసే మార్పులను కూడా ఆ నివేదికల్లో పొందుపరుస్తాం. స్వేచ్ఛాయుత ఇంటర్నెట్.. భారత్‌లో సుదీర్ఘంగా ఉన్న సంప్రదాయం. ఒక కంపెనీగా.. ఆ స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ విలువలు, వాటి ప్రయోజనాల గురించి మాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏ నియంత్రణ సంస్థలతోనైనా మేం కలిసి పనిచేస్తాం. సంపూర్ణ సహకారం అందిస్తాం. న్యాయపరమైన ప్రక్రియలు, విధానాలపై మాకు గౌరవం ఉంది. అందువల్ల ప్రభుత్వాలు అవలంబించే రెగ్యులేటరీ విధానాలకు మేం పూర్తిగా కట్టుబడి ఉంటాం. అది యూరప్‌లోని కాపీరైట్ ఆదేశాలైనా.. భారత్‌లోని డిజిటల్ కంటెట్ నియంత్రణ చర్యలైనా.. వాటిని మేం ఒకేలా చూస్తాం. వాటిని ఎలా పాటించాలన్న దాని గురించి పరిశీలిస్తాం' పిచారు తెలిపారు. భారత్‌లో బుధవారం నుంచి కొత్త ఐటి నియమ నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వివిధ సోషల్ మీడియా వేదికల్లో డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణకు కేంద్రం ఫిబ్రవరి 25న కొత్త ఐటి నిబంధనలు ప్రకటించిన విషయం తెలిసిందే. వాటి అమలుకు ఇచ్చిన 3 నెలల గడువు ముగియడంతో బుధవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.