Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూరత్ : గుజరాత్లో వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు సూరత్. వేలాది కోట్ల వ్యాపారం నడిచే ఈ సూరత్‌లో వజ్రాల కార్మికుల బతుగులు ఆగమవుతున్నాయి. ప్రమాదకర కరోనా మహమ్మారి కార్మికుల ప్రాణాలను హరించివేస్తున్నది. అలాగే, లాక్డౌన్ ఫలితంగా ఏర్పడిన ఆర్థిక సమస్యలు, కుటుంబ భారం వంటి పలు కారణాలు వారి బలవణ్మరణాలకు దారి తీస్తున్నాయి. దీంతో, కుటుంబానికి ఆధారంగా ఉన్న 'కార్మికుడి' మృతితో అతని కుటుంబాలు ఒంటరవుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉంటున్నాయి. డైమండ్ వర్కర్స్ యూనియన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు కరోనాతో దాదాపు 150 మంది కార్మికులు చనిపోయారు. 600 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య 20 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఖ్య 2019 నుంచి 46గా ఉన్నది. ముఖ్యంగా, సూరత్ డైమండ్ ఇండిస్టీలో పని చేసే ఉద్యోగుల సంఖ్య దాదాపు నాలుగుల లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది. వీరిలో అధికంగా గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందినవారే. ఉపాధి కోసం వారి ఇక్కడకు వలస వచ్చి కార్మికులుగా పని చేస్తారు. అయితే, లాక్డౌన్ అనతరం పరిశ్రమలు తెరుచుకున్న తర్వాత దాదాపు లక్ష మంది కార్మికులు తమ సొంత గ్రామాల నుంచి రాలేదు. మూడు లక్షల మంది తిరిగి సూరత్‌కు వచ్చినప్పటికీ వీరిలో చాలా మంది మాత్రం ఉపాధిని పొందడంలో విఫలమయ్యారు. '' చాలా మంది సగం జీతాలకే పని చేస్తున్నారు. ఇప్పుడు వారు రోజుకు రూ. 250 నుంచి రూ. 350 మధ్య పొందుతున్నారు'' అని డైమండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రమేశ్ జిల్రియా తెలిపారు. ఇటు డైమండ్ కంపెనీలు కూడా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని జిల్రియా చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని వ్యాపారులు, యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు చేసినప్పటికీ వాటిని పాటించకుండా కార్మికులతో పని చేయించుకుంటున్నారని చెప్పారు. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం, వజ్రాల వ్యాపారులు, యజమానులు కార్మికులకు చేయూతనివ్వాలనీ, చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆధుకోవాలని డైమండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.