Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినిమయం, పెట్టుబడులే కీలకం
- వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టాలి
- తగ్గిన 2వేల నోట్లు.. ఆర్బీఐ వార్షిక రిపోర్ట్
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక పరిస్థితి అనిశ్చితిలో ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రయివేటు వినిమయం, పెట్టుబడులు పెరగడం ద్వారానే ఆర్థిక వ్యవస్థ పుంజుకోనున్నదని వెల్లడించింది. కరోనా మహమ్మారి తొలి దశతో పోలిస్తే ఆర్ధిక వ్యవస్థపై రెండో దశ ప్రభావం తీవ్రంగా లేదని పేర్కొంది. ఆర్బీఐ 2020-21 వార్షిక రిపోర్ట్‌ను గురువారం విడుదల చేసింది. ఈ సందర్బంగా పలు కీలక అంశా లను ప్రస్తావించింది. వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా చేపడితే ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టాన్ని నియంత్రిం చవచ్చని సూచించింది. గతేడాది కరోనా సంక్షోభంతో విమానయానం, పర్యాట కం, ఆతిథ్య రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని దీంతో సేవా రంగం కుదేలైందని తెలిపింది. ఆర్బీఐ వార్షిక రిపోర్ట్ వివరాలు.. మహమ్మారి విలయం నుంచి ఆర్థిక వ్యవస్ధ బయటపడాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. సెకండ్ వేవ్ వ్యాప్తిని ఎంత త్వరగా మనం అధిగమిస్తామనే దానిపై దేశ వద్ధి ఆధారపడి ఉంది. పలు రంగాల్లో చేపట్టిన సంస్కరణలు భారత వద్ధి సామర్ధ్యానికి ఊతమిస్తాయి. ఆర్ధిక స్ధిరత్వాన్ని కొనసాగిస్తూ వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరిగేలా చర్యలు చేపడతామని ఈ రిపోర్ట్ పేర్కొంది.
తగ్గిన పెద్ద నోట్ల ముద్రణ
గడిచిన రెండేండ్ల నుంచి రూ.2,000 నోట్లను ముద్రించడం మానేసినట్టు ఆర్బీఐ రిపోర్ట్ పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.57,757 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను చెలామణీ నుంచి తప్పించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చెలామణీలో ఉన్న ఈ నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు కాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.4,90,195 కోట్లకు తగ్గింది. మరోవైపు నగదు డిమాండ్‌ను తట్టుకునేందుకు రూ.500 నోట్ల ముద్రణను ఆర్బీఐ పెంచింది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న నోట్లలో రూ.500 నోట్ల వాటా 68.4 శాతం. ఇది గతేడాది 60.8 శాతంగా ఉండేది. 2021 మార్చి ముగింపు నాటికి మొత్తం నగదులో రూ.2వేలు, రూ.500 నోట్ల వాటా 83.4 శాతానికి తగ్గింది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఈ వాటా 85.7 శాతంగా ఉంది.