Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెలలో అత్యధికంగా పెరిగిన చమురు ధరలు
- పలు నగరాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100కు పైనే
న్యూఢిల్లీ : ఇప్పటికే దేశంలో కరోనా సృష్టించిన ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసరాల ధరల పెరుగుదలతో పాటు చమురు ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. వరుసగా పెరిగిన చమురు ధరలు.. బుధవారం ఒక్కరోజు పెరగలేదు. గురువారం మళ్లీ ఇంధన ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 24 పైసలు, లీటర్ డీజిల్‌పై 29 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.94, డీజిల్ ధర రూ.91.87కు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.68, డీజిల్ ధర రూ.84.61కు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.95.28, డీజిల్ లీటర్‌కు రూ.89.39, కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.72, డీజిల్ లీటర్‌కు రూ.87.46గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.52, డీజిల్ రూ.92.32గా ఉంది. కాగా, దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటింది. బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రో బాదులు ఉంటుందని అంచనాలకు అనుగుణంగానే నేడు చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కేవలం ఈ ఒక్క నెలలోనే అత్యధికంగా ఇంధన ధరలు పెరిగాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో చాలా చోట్ల లీటరు పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటింది. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.104.67గా ఉంది. దేశంలో పరిస్థితి ఇలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం క్రూడ్ ఆయిల్ ధరలు గురువారం పడిపోయాయి.