Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు నెలల్లోనే రెట్టింపైన అదానీ ఆస్తులు
- కరోనాలోనూ దూసుకెళ్తున్న సంపద
- మోడీ సన్నిహితులైన ముకేశ్, అదానీ మధ్య మనీ రేస్
న్యూఢిల్లీ : ప్రధానీ మోడీ అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న గౌతం అదానీ సంపద రాకెట్ల దూసుకు వెళ్తున్నది. గడిచిన కొన్ని మాసాలుగా ఆయన సంపద గంటకు రూ.75 కోట్ల చొప్పున పెరుగుతూ వస్తున్నది. ఇదే పరంపర కొనసాగితే ఇంతకాలం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న ముకేశ్ అంబానీని దాటవేయడానికి ఎంతో కాలం పట్టదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్లూం బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం ఈ నెల 23 నాటికి గౌతం అదానీ సంపద రూ.5.03 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఏడాది 142 రోజుల్లో అదానీ సంపద ఏకంగా రూ.2.56 లక్షల కోట్లు పెరిగింది. ఈ కాలంలో ప్రతి గంటకూ సగటున రూ.75 కోట్ల మేరకు ఆయన సంపద పెరుగుతూ వచ్చింది. కేవలం ఐదు మాసాల్లోనే రెట్టింపు సంపదను పోగేశారు.అది కూడా కరోనా వైరస్ విజృంభిస్తున్నదశలో ఈ సంపద పెరగ టం విశేషం. ప్రస్తుతం ముకేశ్ సంపద సుమారు రూ.5.50 లక్షల కోట్లుగా ఉంది. అంటే వీరి మధ్య వ్యత్యాసం తగ్గిందన్న విషయం స్పష్టమవుతోంది. ఆసియా కుబేరుల్లో ముకేశ్ అంబానీ తర్వాత స్థానం గౌతం అదానీదే. గౌతం అదానీ గతేడాది డిసెంబరు వరకు ముకేశ్ అంబానీకి దరిదాపుల్లో కూడా లేరు. ఇంతకుముందు రెండో స్థానంలో ఉన్న చైనా బాటిల్డ్ వాటర్ టైకూన్ జోంగ్షాన్షాన్ను అదానీ దాటేశారు. సంపద రూపేణా పరిశీలిస్తే ఫ్రాన్స్ బిలియనీర్ బెర్నార్డ్ అర్నాట్ ఈ ఏడాది వ్యక్తిగతంగా సంపాదించిన సంపద 47.9 బిలియన్ల డాలర్లు. దీని ప్రకారం బెర్నార్డ్ అర్నాట్ తర్వాత వ్యక్తిగత సంపద పెంచుకున్న బిలియనీర్‌గా గౌతం ఆదానీ నిలిచారు. దేశంలోని 19 మంది ఇతర భారతీయ కుబేరుల సంపద 24.5 బిలియన్ల డాలర్ల కంటే గౌతం ఆదానీ వ్యక్తిగత సంపదే ఎక్కువ. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి.