Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు కరోనా హాట్‌స్పాట్..
- ఫలితాలిస్తున్న కరోనా కట్టడి
ముంబయి: ఆసియాలోనే 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతి పెద్ద మురికి వాడగా పేరున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ధారవి ఒకప్పుడు కరోనా హాట్‌స్పాట్. అక్కడ రికార్డు స్థాయంలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతూ అధికార యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే ధారవిలో గత 24 గంటల్లో కేవలం మూడే కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఫిబ్రవరి 11 నుంచి ఇంతవరకూ ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా ధారవి కరోనా పరిస్థితులను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. గతేడాది కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ధారవిలో మొత్తం 6,798 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 36 శాతం (2,500) కేసులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లలో నమోదయ్యాయి. ఫిబ్రవరి మధ్యలో కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో ఇక్కడ నిత్యం దాదాపు 10 కేసులైనా నమోదయ్యేవి. మార్చిలో రోజుకు కనీసం 50 కేసులు వరకూ నమోదయ్యాయి. దీని కారణంగా మార్చి 23న వనిత సమాజ్ హాల్లోని 250 పడకల క్వారంటైన్ సెంటర్ రోగులతో నిండిపోయింది. ఏప్రిల్ 8న అత్యధికంగా ఒకే రోజు 99 కేసులు నమోదయ్యాయి. మే1 నాటికి ధారవిలో 947 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 62 యాక్టివ్ కేసులు ఉన్నాయి.