Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం వద్ద లేని సరైన ప్రణాళిక
- మందకొడిగా వ్యాక్సినేషన్ డ్రైవ్
- వ్యాక్సిన్ల కొరత.. ముందుచూపు లేని మోడీ సర్కారు
దేశంలో కరోనా సెకండ్‌వేవ్ నియంత్రణలో చేతులెత్తేసిన మోడీ సర్కారు.. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడంలోనూ విఫలమవుతున్నది. ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించే విషయంలో కేంద్రానికి ఒక వ్యూహం లేకపోవడం కారణంగానే దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మందకొడిగా సాగుతున్నదని వైద్య, ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత 60 ఏండ్లు పైబడిన వారికి, ఆ తర్వాత 45 ఏండ్లు పైబడిన వారికి టీకాలు అందిస్తామని చెప్పిన మోడీ సర్కారు.. మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ మందకొడిగా సాగుతున్నది. కేంద్రం నుంచి సరిపడా వయల్స్ రాకపోవడం కార ణంగానే తమ రాష్ట్రాల ప్రజలకు వ్యాక్సిన్‌ను అందిం చలేకపోతున్నామని ప్రభుత్వాలు వాపోతున్నాయి. అయితే, వ్యాక్సిన్ల కొరత కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనీ, సరిపడా నిల్వలను కేంద్రం తన వద్ద ఉంచుకోకపోవడం వల్లనే వ్యాక్సినేషన్ డ్రైవ్ నీరుకారిపోవడానికి కారణంగా మారిందని నిపుణు లు వెల్లడించారు. ఈ కారణంతో అనేక రాష్ట్రాల్లో 18 ఏండ్లు పైబడినవారికి అసలు టీకాలు ఇచ్చే విషయమే పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దేశంలో టీకా డ్రైవ్ ప్రారంభమై ఈనెల 24 నాటికి దాదాపు 130 రోజులు అవుతున్నది. అయితే, దేశ జనాభాలో పూర్తి టీకాలు (మొదటి, రెండో డోసులు) అందుకున్నది 3 శాతం మంది మాత్రమే కావడం గమనార్హం. టీకా రోల్-అవుట్ మొదటి దశ ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైంది. ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఫ్రంట్‌లైన్ కార్మికులను ముందుగా ఈ టీకాలను ఇచ్చారు. అయితే, అంచనా వేసిన మూడు కోట్ల మందిలో ఇప్పటి వరకు సగం మంది వరకు మాత్రమే పూర్తి స్థాయి టీకాలను పొందారు. ఫ్రంట్‌లైన్ వారియర్ల పరిస్థితే ఇలాగ ఉంటే ఇక దేశంలో సామాన్య ప్రజలకు టీకా అందించే విషయం చాలా దారుణంగా ఉన్నది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 18-44 ఏండ్లు ఉన్నవారి జనాభా (2021 ఏడాదిలో అంచనా ప్రకారం) దాదాపు 59.46 కోట్ల మంది. అయితే వీరిలో మొదటి డోసును పొందినవారు 2.75 కోట్ల మంది. అంటే కేవలం 5శాతం అన్నమాట.ఇక 45-59 ఏండ్ల మధ్య ఉన్నవారు 20.68 కోట్ల మంది. వీరిలో 6.74 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఫస్ట్ డోసు అందింది. అంటే 33 శాతం మంది టీకాను పొందారు. అలాగే, 60 ఏండ్లు పైబడినవారి సంఖ్య 13.76 కోట్ల మంది అని అంచనా. ఇందులో 5.75 కోట్ల మందికి వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు. అంటే 42 శాతం మందికి వ్యాక్సిన్ అందింది.
అయితే, ప్రభుత్వ గణాంకాల ప్రకారమే.. ఏ ఒక్క ఏజ్ గ్రూప్‌లోని వ్యాక్సినేషన్ తొలి డోసు 50 శాతాన్ని కూడా దాటలేదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. టీకానే రక్షణ అంటూ పలు సందర్భాల్లో దేశ ప్రజలకు చెప్తున్న మోడీ.. వ్యాక్సి నేషన్ డ్రైవ్ మందకొడిగా సాగడాన్ని గుర్తించకపో వడం గర్హనీయమని అన్నారు. రాష్ట్రాలకు సరిపడా వ్యాక్సిన్లను సరఫరా చేసి ప్రజలందరికీ వ్యాక్సిన్ అందే విధంగా కేంద్రం కృషి చేయాలనీ, లేకపోతే థర్డ్‌వేవ్ రూపంలో భారీ ప్రమాదం ముందున్నదని హెచ్చరించారు.