Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రఫుల్ పటేల్ నిర్ణయాలపై రాజకీయ రగడ
- ఆయనను తొలగించాలని ప్రతిపక్షాల డిమాండ్
- రెండుగా చీలిన బీజేపీ.. అధిష్టానానికి లేఖలు
న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, ఆయన తీసుకొచ్చిన చట్టాలు, ప్రతిపాదనలు చిచ్చు రేపాయి. దీనిపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం ఏకమయ్యాయి. ప్రఫుల్ పటేల్ తొలగింపునకు డిమాండ్ చేశాయి. ఈ విషయంపై లక్షద్వీప్ బీజేపీ రెండుగా చీలిపోయింది. ఈ పంచాయితీ ఢిల్లీ పెద్దల వద్దకు చేరింది.
లక్షద్వీప్‌కు కొత్తగా నియమించిబడిన అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్. అయితే, ఆయన ఇటీవల తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు రాజకీయంగా చిచ్చ రేపుతున్నాయి. ముఖ్యంగా ముస్లింలు అధికంగా ఉండే ఈ ద్వీపంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, తీసుకొచ్చిన చట్టాలు ఆ వర్గం ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీనిపై వారు తమ అసమ్మతిని తెలుపుతున్నారు. ముఖ్యంగా బీఫ్ ఉత్పత్తులపై నిషేధించడం, కోస్ట్ గార్డ్ యాక్ట్ కింద తీర ప్రాంతాల వెంబడి మత్స్యకారుల షెడ్డులను తొలగించడం, మద్యపానంపై ఉన్న ఆంక్షలను రద్దు చేయడం, గూండా యాక్ట్, డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ తో పాటు మరికొన్ని పటేల్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు. ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో బీఫ్ వినియోగం సాధారణంగానే అధికంగా ఉంటుంది. అంతేకాకుండా మత్స్యకారుల జీవనోపాధిని సైతం దెబ్బతీసేలా ఆయన తీరు ఉన్నది. ఇప్పటి వరకు లక్షద్వీప్‌లో మద్యపానంపై ఆంక్షలు ఉండేవి. అయినప్పటికీ ఈ ప్రాంత పర్యాటక రంగంపై ఏ మాత్రమూ ప్రభావం చూపలేదు. అయితే, కేంద్రపాలిత ప్రాంతంలో పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగానే ఈ సంస్కరణలు తీసుకొచ్చినట్టు అక్కడి యంత్రాంగం చెప్పుకోవడం గమనార్హం.
వీటితో పాటు, పాఠశాలల్లో మధ్యహ్న భోజన పథకంలో, హాస్టళ్లలో మాంసాహారాన్ని నిషేధించారు. అయితే, ప్రఫుల్ పటేల్ నిర్ణయాలపై లక్షద్వీప్‌లోని బీజేపీయేతర పార్టీలు ఇప్పటికే చేతులు కల్పిపాయి. అడ్మినిస్ట్రేర్ బాధ్యతల నుంచి ప్రఫుల్ పటేల్‌ను తొలగించాలంటూ భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు ఒక భారీ పిటిషన్‌ను అందించేందుకు ఆ పార్టీలు ప్రణాళికను రూపొందించాయి.
ఎవరు ఈ ప్రఫుల్ ఖోడా పటేల్?
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న దినేశ్ శర్మ గతేడాది డిసెంబర్ 5న మరణించారు. అయితే, మోడీ ప్రభుత్వం ప్రఫుల్ పటేల్‌ను లక్షద్వీప్ అడ్మినిస్ట్రేర్‌గా కొత్తగా నియమించింది. అయితే, ఈయన గుజరాత్ బీజేపీ మాజీ నాయకుడు. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ప్రఫుల్ పటేల్ ఆ రాష్ట్ర హౌం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధాని మోడీతో పాటు, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, బీజేపీ అధినాయకత్వంతో ప్రఫుల్ పటేల్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా, కేంద్రపాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్‌గా సివిల్ సర్వెంట్లను నియమించడం ఆనవాయితి. అయితే, ఆ సాంప్రదాయాన్ని తోసిపుచ్చుతూ ముస్లిం జనాభా అధికంగా ఉండే లక్షద్వీప్‌కు ఒక రాజకీయ నాయకుడైన ప్రఫుల్ పటేల్‌ను నియమించడం గమనార్హం.
ఆయన వివాదాస్పద నిర్ణయాలు ఏమిటి?
- లక్షద్వీప్ జంతు పరిరక్షణ నియంత్రణ చట్టం, 2021ను పటేల్ యంత్రాంగం ప్రతిపాదించింది. దీని ప్రకారం.. ఆవుతో పాటు మరికొన్ని జంతువులను వధించడం నిషేధం. అలాగే, బీఫ్, బీఫ్ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు కూడా నిషేధం.
- లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ - దీని ద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్న భూయాజమాన్య, వినియోగ హక్కులలో మార్పులు రానున్నాయి. దీని ప్రకారం.. లక్షద్వీప్‌లోని ఏ భూమిలో అయినా అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వానికి అనుమతి ఉంటుంది. అలాగే, హౌటళ్లు, రిసార్టుల్లో లిక్కర్ అమ్మకాలకు ఈ చట్టం అనుమతినిస్తుంది.
ొ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ కోస్ట్ గార్డ్ యాక్ట్ కింద తీరరేఖ వెంబడి ఉన్న మత్స్యకారుల గుడిసెలను కేంద్రపాలిత ప్రాంతం యాజమాన్యం తొలగించింది.
- అలాగే, క్రైమ్ రేటు చాలా తక్కువగా ఉండే లక్షద్వీప్‌లో గూండా యాక్ట్‌ను ప్రవేశపెట్టడం, ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉండే వారిని పంచాయతీని ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించడం వంటివి కూడా అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి.
శాంతికి విఘాతం కలిగిస్తున్న యంత్రాంగం
- సీపీఐ(ఎం) సహా ప్రతిపక్ష పార్టీల ఆరోపణ
కాగా, ఈ ప్రాంతంలో శాంతిని, సంస్కృతిని కేంద్రపాలిత ప్రాంత యంత్రాంగం నాశనం చేస్తున్నదని సీపీఐ(ఎం), కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్షపార్టీలు ఆరోపించాయి. పటేల్‌ను వెంటనే తొలగించాలంటూ కేరళ సీఎం విజయన్, కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్‌లు డిమాండ్ చేశారు. ఈ విషయంలో వెంటనే కలుగజేసుకోవాలని కేరళ లెఫ్ట్, కాంగ్రెస్ ఎంపీలు రాంనాథ్ కోవింద్, మోడీలకు లేఖలు రాశారు.
అడ్మినిస్ట్రేటర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో ''సేవ్ లక్షద్వీప్'' పేరిట హ్యాష్‌ట్యాగ్‌తో క్యాంపెయిన్ మొదలైంది. దీనికి పలవురు సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు తమ మద్దతును ప్రకటించారు.
రెండుగా చీలిన బీజేపీ
అడ్మినిస్ట్రేర్ నిర్ణయాల విషయంలో లక్షద్వీప్ బీజేపీ యూనిట్ రెండుగా చీలిపోయింది. ఈ పంచాయితీ పార్టీ అధిష్టానం వద్దకు చేరుకున్నది. బీజేపీ లక్షద్వీప్ యూనిట్ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ హాజీ.. పటేల్ నిర్ణయాలను సమర్థించారు. అయితే, పార్టీ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ కాసిం మాత్రం అడ్మినిస్ట్రేటర్ నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ నిర్ణయాలు ఇక్కడి ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం తీసుకొచ్చినవి కాదని తెలిపారు. తన అభ్యంతరాలను తెలుపుతూ కాసిం ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు.