Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే ఉపసంహరించాలి : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అత్యంత ప్రమాదకరమైన, తిరోగమన ఐటీ నిబంధనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో కోరింది. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సంస్థల కోసం ఐటీ చట్టంలో సురక్షితమైన నిబంధనలకు సంబంధించి కొన్ని నియమాలను ఇటీవల కేంద్రం సవరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం నుంచి ఇవి అమల్లోకి రావాల్సి వున్నాయి. తాజా నిబంధనల ప్రకారం సోషల్ మీడియా సంస్థల్లో ఏదేని ఒక సందేశం వస్తే దానికి మూలం ఎక్కడిది, ఎవరు పంపించారో గుర్తించాల్సి వుంది. కోర్టు లేదా ప్రభుత్వం ఎవరు కోరినా ఈ సమాచారాన్ని వారికి అందచేయాల్సి వుంటుంది. ఈ నిబంధనను ఫేస్బుక్, వాట్సాప్‌లు ప్రశ్నిస్తున్నాయి. దీనివల్ల ప్రస్తుతమున్న ప్రొటోకాల్ భద్రతను, వాట్సాప్ ఉపయోగించేవారి భద్రతను ఉల్లంఘించడమే కాగలదని పేర్కొంటున్నాయి. సాంకేతిక నిపుణులు కూడా ఈ అంశాన్ని ధ్రువీకరించారు. భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను బలహీనపరచడం వల్ల వినియోగదారుల ప్రైవసీ దెబ్బతింటుందనీ, నేర ప్రయోజనాలకు వీటిని హ్యాకింగ్ చేసే అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటున్నాయి. ఫేస్బుక్ తన వ్యాఖ్యలు, పరిశీలనలకు అనుగుణంగా ఇప్పుడు తన బిజినెస్ అప్లికేషన్స్‌లో వాట్సాప్ భద్రతను బలహీపరిచే అంశాన్ని సమీక్షించి, ఉపసంహరించాలి. భారతదేశంలో వాట్పాస్ డేటాను ఫేస్బుక్ పొందాలనుకుంటుంది. యూరోపియన్ యూనియన్‌లో యూజర్ ప్రైవసీపై ఇయు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుంది. అక్కడ ఇటువంటి సౌలభ్యాన్ని కల్పించలేదు. పలువురు బీజేపీ నేతలు చేసిన ట్వీట్లు మీడియాలో అవకతవకగా చూపించారంటూ ట్విట్టర్‌ను బెదిరించేందుకు కేంద్రం ఢిల్లీ పోలీసులను ఉపయోగిస్తోంది. ఐటీ మంత్రిత్వ శాఖను పక్షపాత రీతిలో బీజేపీ ప్రభుత్వం ఉపయోగించడాన్ని ఖండించింది. ట్విట్టర్ కార్యాలయాలపై పోలీసుల దాడులను తీవ్రమైన బెదిరింపు చర్యలుగా పేర్కొంది. ప్రజలు పంపే సందేశాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చేందుకు గానూ భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను దెబ్బతీయడం చాలా ప్రమాదకరమైన, తిరోగమనంతో కూడిన చర్య అని పేర్కొంది. ఈచర్యలు పౌరుల గోప్యతా హక్కును ఉల్లంఘిస్తూ ప్రభుత్వ నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తాయని పేర్కొంది. తక్షణమే ఈ నిబంధనలన్నింటినీ ఉపసంహరించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.