Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా వ్యాక్సిన్లపై పన్ను తగ్గింపునకు కేంద్రం నో
- సెకండ్‌వేవ్‌లో కరుణ చూపాలన్న రాష్ట్రాలు
- చిల్లిగవ్వతగ్గించం : మోడీ సర్కార్ ొ అసంపూర్తిగా 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
సుమారు ఏడు నెలల తర్వాత భేటీ అయిన 43వ కౌన్సిల్ సమావేశంలో రాజీ కుదరలేదు. దేశమంతా కోవిడ్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. సెకండ్‌వేవ్‌తో భారీగా జనం చనిపోతున్నారు. కాని మోడీ సర్కార్‌లో మాత్రం కనికరం కనిపించటంలేదు. కరోనా వ్యాక్సిన్లు, మందులు, ఇతర పరికరాలపై పన్ను తగ్గించాలని రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తెచ్చాయి. ఇప్పటికే ప్రయివేటు ఆస్పత్రుల్లో నిలువుదోపిడీకి తోడుగా కరోనా మందులు ఖరీదైపోతున్న విషయాన్ని ప్రస్తావించాయి. కీలకమైన అంశమంటూ రాష్ట్రాలు ప్రతిపాదించినా.. మోడీ ప్రభుత్వం మాత్రం మా ఖజానాలో చిల్లిగవ్వతగ్గించమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యవహరించారు. బీజేపీ ప్రభుత్వం తీరుపై ఆర్థిక నిపుణులు,ప్రజాసంఘాలు, రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్లపై పన్ను తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏడు నెలల తరువాత ఈ ఆర్థిక సంవత్సరం మొదటి (43వ) జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ పరిహారం నుంచి రాష్ట్రాలకు అవసరమైన కరోనా పరికరాలు, వ్యాక్సిన్ సరఫరాపై పన్ను వరకు సమావేశంలో అనేక సమస్యలు చర్చించారు.
కరోనా సంబంధిత నిత్యావసరాలపై జీఎస్టీ పన్నుపై ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం సమావేశం ప్రధాన ఎజెండాల్లో ఒకటి అయినప్పటికీ, టీకాలపై పన్ను రేట్ల తగ్గింపుపై ఏకాభిప్రాయం కుదరలేదు. 10 రోజుల్లో కలుసుకుని తిరిగి రావాలని మంత్రుల బందానికి (జీఓఎం) సూచించబడింది. చిన్న వ్యాపారులకు త్రైమాసిక రాబడి కొనసాగుతుందని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. జీఎస్టీ చెల్లింపు కోసం ఆలస్య రుసుము జరిమానాను సడలించింది. కరోనా సంబంధిత ఉపశమన వస్తువులపై ఐజీఎస్టీ ఆగస్టు 31 వరకు కౌన్సిల్ మినహాయింపు ఇచ్చింది.కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నది. వివిధ మందులు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలతో సహా అవసరమైన సదుపాయాల సరఫరాపై జీఎస్టీ రేట్లను తగ్గించాలని పలు రాష్ట్రాలు కోరాయి. రాష్ట్రంలో కరోనా సెస్ విధించాలన్న సిక్కిం ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించారు. సిక్కిం ప్రతిపాదనను పరిశీలించడానికి జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయంపై సిఫారసును రెండు వారాల్లో కౌన్సిల్‌కు సమర్పించాలని తెలిపింది. రాష్ట్రాలు ఇప్పటికే నెల చివరి వరకు లాక్డౌన్లను ప్రకటించడంతో జీఎస్టీ కౌన్సిల్ పలు ఫిర్యాదుల గడువులను పొడిగించడంపై కూడా పరిశీలించింది. రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం జారీకి సంబంధించి ఈ కొరతను రూ.2.69 లక్షల కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రాలకు వాగ్దానం చేసిన పరిహారాన్ని తీర్చడానికి మిగిలిన రూ.1.58 లక్షల కోట్లు రుణం తీసుకోవలసి ఉంటుంది. లగ్జరీ, డీమెరిట్ వస్తువులపై సెస్ ద్వారా రూ.1.11 లక్షల కోట్లు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ కేంద్రం ఏ రాష్ట్రానికి నష్ట పరిహారాన్ని నిరాకరించడం లేదనీ, అయితే రుణాలు తీసుకునే ఎంపికను ఎంచుకోని వారు మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవలసి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ అమలు వల్ల వచ్చే ఆదాయ కొరత పరిహారం కోసం 21 రాష్ట్రాలు రుణాలు తీసుకునే ఆప్షన్ 1ను ఎంచుకున్నాయని చెప్పారు. కరోనా సంబంధిత పరికరాలకు మినహాయింపులు ఇచ్చామని, 2021 ఆగస్టు 31 వరకు పొడిగించిన మినహాయింపుతో చాలా వస్తువుల దిగుమతిని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించిందని తెలిపారు. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న కారణంగా మినహాయింపుల జాబితాలో ఆంఫోటెరిసిన్ బి కూడా చేర్చబడిందని నిర్మలా సీతారామన్ అన్నారు. కరోనా సంబంధిత పరికరాల సమస్యలు ఎజెండా లోని అంశాలలో ఒకటనీ, ఇది చాలా వివరంగా చర్చించామని అన్నారు. అనేక సమస్యలు లేవనెత్తారనీ, వాటి గురించి చర్చించామని తెలిపారు. సహాయక వస్తువుల దిగుమతిని 2021 ఆగస్టు 31 వరకు మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించిందని అన్నారు. అమ్నెస్టీ పథకం 89 శాతం జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. 2022 జులైకి మించి పరిహార సెస్ విషయంపై మాత్రమే ప్రత్యేక సెషన్ ఉంటుందని అన్నారు. ''రూ.1.58 లక్షల కోట్ల విలువైన పరిహార డబ్బును రాష్ట్రాలకు బ్యాక్ టు బ్యాక్ రుణాలుగా ఇస్తాం'' అని పేర్కొన్నారు.