Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిటీ వేసిన ఎన్జీటీ
న్యూఢిల్లీ: పారిశ్రామిక కార్యకలాపాల నిర్వహణలో జిందాల్ స్టీల్ వర్క్స్(జేఎస్డబ్ల్యూ) కంపెనీ పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలపై విచారణకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) శనివారం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర, రాయఘర్ జిల్లాలోని పలు గ్రామాల్లో జేఎస్డబ్ల్యూ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో కంపెనీ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ అదే జిల్లాకు చెందిన సమిత రాజేంద్ర పాటిల్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. నీరు, వాయు చట్టాలు, ప్రమాదకర పదార్థాల నిర్వహణ వంటి నిబంధనలు, మడ అడవులను నాశనం చేయడం, వ్యవసాయానికి నష్టం వంటివి ఉంటే పరిశీలించాలని ఎన్జీటీ చైర్పర్సన్ నేతృత్వంలోని బెంచ్ కమిటీని కోరింది. ఆరోపణలు నిజమైతే.. పర్యావరణ నష్టం, అందుకు చెల్లించాల్సిన పరిహారాన్ని అంచనా వేయడంతో పాటు పునరుద్ధరణ ప్రణాళికను సూచించాలని తెలిపింది. కమిటీ నిపుణుల సలహాలు తీసుకోవచ్చని, అయితే విచారణను ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని స్పష్టం చేసింది. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ర్యాంకు కలిగిన అధికారి అధ్యక్షతన ఈ కమిటీ ఉంటుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటి-ముంబై నుంచి ఒక్కొక్కరు, రాయఘర్ జిల్లా కలెక్టర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఒకరు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.