Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ ప్రకటన
న్యూఢిల్లీ : కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులందరికీ ఉచిత విద్య అందించడంతో పాటు పీఎం కేర్స్ నుంచి వారికి పలురకాల లబ్ధి చేకూర్చనున్నట్టు ప్రధాని మోడీ శనివారం ప్రకటించారు. అనాథలైన చిన్నారుల విషయంపై చర్చించేందుకు మోడీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ 10 లక్షల రూపాయల కార్పస్ ఫండ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఉన్నత విద్య సమయంలో వారి అవసరాల కోసం నెలవారీ స్టైఫండ్‌ను ఈ కార్పస్ ఫండ్ నుంచి కేటాయిస్తామన్నారు. 23 ఏండ్లు వచ్చిన తర్వాత వ్యక్తిగత, కెరీర్ అవసరాల నిమిత్తం ఆ కార్పస్ ఫండ్ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇంకా ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలపై వడ్డీ చెల్లిస్తామని.. 18 ఏండ్ల వయసు వరకు ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించి, ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు. 'దేశ భవిష్యత్తుకు చిన్నారులకు ఆస్తి. వారికి మద్దతిచ్చేందుకు, కాపాడుకునేందుకు ఎంతైనా చేస్తాం. అనాథలైన చిన్నారులకు రక్షణ ఇవ్వడం, భవిష్యత్తుపై వారికి ఆశ కల్పించడం మన బాధ్యత' అని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.