Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ సరిహద్దుకు ఎఐకెఎస్ నేతత్వంలో వేలాది పంజాబ్ రైతులు
- జూన్ 5 నల్ల చట్టాల ప్రతులు దహనం
న్యూఢిల్లీ : మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం శనివారం నాటికి 183వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం అవుతున్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి వందలాది ట్రాక్టర్లతో వేలాది మంది ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు తమ గోధుమ కోత తరువాత ఢిల్లీ సమీపంలోని సింఘూ సరిహద్దుకు చేరుకుంటున్నారు. అఖిల భారత కిసాన్ సభ (ఎఐకేఎస్) నేతృత్వంలో శనివారం వేలాది మంది రైతుల బృందం సింఘూ సరిహద్దుకు చేరుకుంది. ఆ బృందానికి ఎఐకేఎస్ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధవాలే, కోశాధికారి పి. కృష్ణ ప్రసాద్ స్వాగతం పలికారు. పంజాబ్ నుంచి టాక్టర్స్ ట్రాలీలతో వేలాది మందికి సింఘూ సరిహద్దు సమీపానికి చేరుకున్నారు. అక్కడ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల మేర కిసాన్ సభ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల నిర్ణయాల్లో భాగమే ఈ మూడు నల్ల చట్టాలు అని నేతలు విమర్శించారు. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా మే 26 ''బ్లాక్ డే'' దేశవ్యాప్తంగా విజయవంతం అయిందని, దేశవ్యాప్తంగా వీధుల్లో నల్ల జెండాలు ప్రదర్శించారని తెలిపారు.
ఇదిలా వుండగా జూన్ 5న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక నల్ల చట్టాల ప్రతులు దహనం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు నిచ్చింది. ఈ చట్టాలు మొదట గతేడాది ఇదే రోజున కరోనా కాలంలో మోడీ సర్కార్ ప్రకటించింది. 1974 జూన్ 5న జయప్రకాష్ నారాయణ్ ఒక సామూహిక ప్రజల పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్కేఎం జూన్ 5న దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చింది.