Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి
- తీవ్రంగా ఖండించిన పొలిట్‌బ్యూరో
- సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అజరుకుమార్పై దాడి
పాట్నా :బీహార్ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అజరుకుమార్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. సమస్తిపూర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి ఈ దాడి జరిగింది. అయితే, అజరుకుమార్ దీని నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయన భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. శనివారం రాత్రి 10 గంటల తరువాత కొందరు దుండగులు పార్టీ కార్యాలయంలోకి దూసుకొచ్చి అజరుపై దాడికి యత్నించారని పార్టీ సీనియర్ నాయకులు సర్వోద్య శర్మ తెలిపారు. అయితే ఇతర వ్యక్తులు అక్కడకు చేరుకోవడంతో దుండగులు పారిపోయారని ఆయన అన్నారు. ఈ దాడిలో సెక్యూరిటీ గార్డు గాయపడినట్టు చెప్పారు. అజరుపై దాడి జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గత నెలలో కూడా ఆయనపై దాడి జరిగింది. సమస్తిపూర్ జిల్లాలోని విభూతిపూర్ నియోజకవర్గ నుంచి అజరు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీపీఐ(ఎం) శాసనసభ పక్ష నేతగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అజరుకుమార్ మంచి ప్రజాదరణ కలిగి ఉన్న నేత. 2020 ఎన్నికల్లో బిభూతిపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే (జేడీయూ) రామ్ బలక్ సింగ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు.
పటిష్ట భద్రత కల్పించాలి..
ఎమ్మెల్యే అజరుకుమార్పై హత్యాయత్నాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. దోషులను, వారిని ప్రోత్సహించినవారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అజరుకుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగినరీతిలో భద్రత కల్పించాలని, అజరుకుమార్పై ఇలాంటి దాడులు ఎందుకు పునరావృతమవుతున్నాయనే దానిపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. ఈ దాడిని ఖండిస్తూ మే 31న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దినం పాటించాలని అన్ని జిల్లా కమిటీలను, యూనిట్లను కోరింది.