Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది రెట్లు పెరిగిన ఆక్సిజన్ ఉత్పత్తి : ''మన్ కీ బాత్''లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి మూలంగా దేశంలో ప్రతి రంగం దెబ్బతిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అయితే, ఈ సంక్షోభ సమయంలో కూడా వ్యవసాయ రంగం తనని తాను కాపాడుకోవడంతో పాటు ఇంకా పురోగతి సాధించిందని తెలిపారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్ కీ బాత్'లో ప్రధాని మోడీ మాట్లాడారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా సాగు దిగుబడులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయన్నారు. రైతుల కష్టపడటంతోనే దేశంలో దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించగలుగుతున్నామని అన్నారు. ఓ వైపు మహమ్మారితో పోరాడుతున్న సమయంలోనే భారత్‌పై 'తౌక్టే', 'యాస్' వంటి భారీ తుఫానులు విరుచుకుపడ్డాయన్నారు. వీటి వల్ల అనేక రాష్ట్రాలు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ ప్రజలు ప్రకృతి విపత్తులను ధైర్యంగా ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో వైద్యులు, నర్సులతో పాటు ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు చేస్తున్న కృషి మరువలేనిదని మోడీ అన్నారు. రెండో దశ విజృంభణ సమయంలో ఆస్సత్రులకు తాకిడి పెరగడంతో ఆక్సిజన్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని గుర్తు చేశారు. ఆక్సిజన్ సరఫరాలో అనేక ఇబ్బందులు తలెత్తాయన్నారు. ప్రారంభంలో రోజుకు 900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే... నేడు 9,500 మెట్రిక్ టన్నులకు పెంచామని తెలిపారు. దాదాపు 10 రెట్లు ఉత్పత్తి పెరిగిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు పూర్తి చేసుకుందన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం సాధించిన ప్రతి విజయం ఈ దేశం, ఈ దేశ ప్రజలకే చెందుతుందన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ లేకుండా ముందుకు సాగడం, మన దేశంపై కుట్రలు చేసే వారికి దీటుగా జవాబు చెప్పడం వంటి ఉదంతాల్ని చూస్తే మనం సరైన దిశగా వెళుతున్నట్టే అర్థమవుతోందన్నారు.