Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమైక్యంగా మన వాణి వినిపిద్దాం
- బీజేపీయేతర సీఎంలకు కేరళముఖ్యమంత్రి విజయన్ లేఖ
తిరువనంతపురం : వ్యాక్సిన్ సంక్షోభాన్ని పరిష్క రించేందుకు సంయుక్తంగా చర్యలు తీసుకునే దిశగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నడుం బిగించారు. ఉచిత వ్యాక్సినేషన్ కోసం తమ వాణిని వినిపించాలని కోరుతూ బీజేపీయేతర ముఖ్యమంత్రులకు విజయన్ లేఖ రాశారు. కోవిడ్ వ్యాక్సిన్లు సమీకరించుకునేందుకు ఎవరికి వారు స్వంతంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రా లను కోరిన నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు విజయన్ ఈ లేఖ రాశారు. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రమే సమీకరించీ, ఉచితంగా పంపిణీ చేయాలని మనమంతా సమిష్టిగా గొంతె త్తాల్సిన సమయం ఆసన్నమైందని విజయన్ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల ఖర్చు కూడా బాగా తగ్గుతుందన్నారు. రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్ల అవసరాలను సమీక్షించడంలో కేంద్రమే చొరవ తీసుకోవాలని, రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని గ్లోబల్ టెండర్లను కేంద్రమే పిలవా లంటూ విజయన్ ప్రధాని మోడీకి ఇప్పటికే ఒక లేఖ రాశారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా వ్యాక్సిన్లను అందచేయాలనీ, ఆర్థిక వనరులు లేవన్న కారణంగా ఎవరికీ వ్యాక్సిన్లు నిరాకరించరాదని అందులో కోరారు.
దేశంలో కరోనా రెండో దశ ఉధృతి ఎక్కువగా వున్న ఈ క్లిష్టమైన తరుణంలో రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్ను అందచేయాల్సిన బాధ్యత నుండి కేంద్రం తప్పుకోజూడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రెండో దశ సృష్టించిన ప్రభావం అనూహ్యమైనదనీ, మనందరమూ ఒక ప్రమాదకర మైన పరిస్థితిలోకి నెట్టబడ్డామని ఆయన అన్నారు. దీనికి తోడు, మూడో వేవ్ ముప్పు కూడా పొంచి వుందనే నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి అనివార్యమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు మరింత అప్రమత్తతతో, పూర్తి సన్నద్ధతతో వుండాల్సిన అవసరం మరింత వుంది. ఈ పరిస్థితుల్లో ఫెడరలిజం విలువలు హరించుకుపోతున్నాయనడానికి వ్యాక్సిన్లను సమకూర్చుకునే బాధ్యత, భారాన్ని రాష్ట్రాలపైకి పూర్తిగా లేదా పాక్షికంగా నెట్టివేయడమే ఒక ఉదాహరణ అని అన్నారు. దీని వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందన్నారు. ఆరోగ్యవంతమైన ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల ఆర్థిక పరిపుష్టి అతి ముఖ్యమైన భాగమని విజయన్ పేర్కొన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు కుంటుపడినట్లైతే ఫెడరలిజం బలహీనపడుతుంది. ఇది, ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. పైగా, త్వరగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలన్న మన ప్రయత్నాలకు ఇది మరింత అవరోధం కలిగిస్తుంది. జనాభాలో మెజారిటీ భాగం వ్యాక్సిన్లు వేయించుకుంటేనే హెర్డ్ ఇమ్యూనిటీ సమర్ధవంతంగా వుంటుంది. ఇప్పటివరకు, కేవలం 3.1శాతం మంది మాత్రమే రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకోగలిగారు. టీకాల కొరతను ఉపయోగించుకుని వ్యాక్సిన్ కంపెనీలు అధిక లాభాల కోసం ప్రయత్నిస్తున్నాయని విజయన్ ఆ లేఖలో పేర్కొన్నారు.