Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే వ్యాక్సిన్‌కు ధరల్లో తేడాలెందుకు..?
- సుప్రీంకోర్టు ప్రశ్నలతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి
- టీకా గ్లోబల్ టెండర్లు.. పలు అంశాలపై నిలదీత
న్యూఢిల్లీ: కరోనా నిర్వహణలో విఫలమైందంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని మోడీ సర్కారుపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సంబం ధిత అంశాలను సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు విచారణ జరుపుతు న్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం కూడా దేశంలో కరోనా పరిస్థితులు.. కేసులు, మరణాలు, కోవిడ్ చికిత్స అత్యవసర మందులు, ఆక్సిజన్, టీకాల లభ్యత వంటి పలు అంశాలపై విచారణ జరిపింది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సినేషన్‌పై మోడీ సర్కారు అనుసరిస్తున్న ప్రొక్యూర్మెంట్ పాలసీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పలు అంశాలకు సంబంధించి కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
దేని ఆధారంగా విభజన చేశారు?
''45 ఏండ్లు పైబడిన వారికోసం కేంద్రమే టీకాలు సేకరిస్తోంది. 18-44 ఏండ్ల వారికోసం మాత్రం టీకా కొనుగోలులో తేడాలున్నాయి. 50 శాతంమేర తయారీ సంస్థల నుంచే రాష్ట్రాలు నేరుగా కోనుగోలు చేయవచ్చు. అలాగే ప్రయివేటు ఆస్పత్రులకు సైతం టీకాలు కేటాయిస్తున్నారు. ఏ ఆధారంతో ఈ విభజన చేశారు? 45 ఎండ్లు పైబడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువ అనే అంచనా అయితే.. సెకండ్‌వేవ్‌లో 18-44ఏండ్లున్న వారిపై వైరస్ ప్రభావం చూపింది. టీకాలు సేకరించడం వెనుక ఉద్దేశం ఇదే అయితే.. 45 ఏండ్లు దాటిన వారినే ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి?' అంటూ న్యాయమూర్తులు జస్టిస్ డివై.చంద్రచూడ్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల త్రిసభ్య ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.
డిజిటల్ డివైడ్పై ఆందోళన
టీకా తీసుకునేముందు ప్రతి ఒక్కరూ కొవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలనే అంశాన్ని ప్రస్తావిస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యమేనా? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి 'గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కంప్యూటర్ కేంద్రానికి వెళ్లి రిజిస్టర్ చేసుకొని టీకా పొందవచ్చు' అంటూ కేంద్రం స్పందించింది. 'వాస్తవంగా ఇది ఆచరణాత్మకమా?' అంటూ సుప్రీం మరోసారి ప్రశ్నించింది. వలస కార్మికులకు కూడా ఈ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపింది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిక మెరుగైన చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.