Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020-21లో జీడీపీ మైనస్ 7.3 శాతం పతనం
- చివరి త్రైమాసికంలో 1.6 శాతం వృద్థి
- బీజేపీ పాలనలోనే దిగజారిన ఆర్థిక వ్యవస్థ
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ హయంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గత నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా పడిపోయింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఏకంగా మైనస్ 7.3 శాతం క్షీణించింది. కరోనా సంక్షోభానికి తోడు అంతకుముందే ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం వల్ల గత 40 ఏండ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో పతనాన్ని చవి చూసింది. 1979-80లో అత్యల్పంగా మైనస్ 5.20 శాతాన్ని నమోదు చేసింది. ఆ కాలంలోనూ కరువు, ముడి చమురు ధరలు రెట్టింపు అయ్యాయి. నాడు జనతాపార్టీ అధికారంలో ఉన్నది. ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో అధికారంలోకి వచ్చిన 33 నెలలకే మొరార్జీ దేశారు సర్కార్ పడిపోయింది. 2019-20లో జీడీపీ 4 శాతం పెరిగినప్పటికీ.. 11 ఏండ్ల కనిష్టానికి పడిపోయింది. సోమవారం కేంద్ర ప్రభుత్వం 2020-21కి సంబంధించిన జీడీపీ గణంకాలను వెల్లడించింది. 2011-12 స్థిర ధరలతో పోల్చితే గడిచిన ఆర్థిక సంవత్సరంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) రూ.135.13 లక్షల కోట్లుగా నమోదైంది. 2019-20లో ఇది రూ.145.69 లక్షల కోట్లుగా ఉన్నది. 2020-21 మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో జీడీపీ 1.6 శాతం పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 3 శాతం వృద్థి నమోదైంది. పొరుగు దేశం చైనా మార్చి త్రైమాసికంలో ఏకంగా 18.3 శాతం వృద్థిని సాధించడం విశేషం. 2011-12 ధరల ఆధారంగా గడిచిన మార్చి త్రైమాసికంలో జీవీఏ రూ.38.96 లక్షల కోట్లుగా నమోదైంది. 2019-20లో ఇదే త్రైమాసికంలో రూ.38.33 లక్షల కోట్లుగా ఉంది. 2020-21 జూన్, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం జీడీపీ గణంకాలను వరుసగా మైనస్ 24.4 శాతం, మైనస్ 7.3 శాతానికి సవరించింది. ఇంతక్రితం ఈ గణంకాలు మైనస్23.9 శాతం, మైనస్7.5 శాతంగా అంచనా వేసింది.
దిగజారుతున్న వ్యవస్థ
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంభిస్తున్న అనాలోచిత ఆర్థిక విధానాలు జీడీపీని దిగజారేలా చేశాయని విమర్శలు పెరుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం 2016లో అనుహ్యాంగా, అనాలోచితంగా చేపట్టిన నోట్ల రద్దు.. ఆ తర్వాత ఏడాది ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను కుదేలు చేశాయి. ఆ ఏడాది 8.26 శాతం వృద్థి కనబర్చినప్పటికీ.. 2017-18లో 7.04 శాతానికి పడిపోయింది. ఈ రెండేండ్లు అంకెల గారడి చేసిందనే విమర్శలు ఉన్నాయి. 2018-19లో 6.12 శాతం, 2019-20లో 4.2 శాతానికి జీడీపీ పడిపోతూ వచ్చింది. కరోనా కట్టడిలో విఫలం కావడంతో 2020-21లో మైనస్ 7.3 శాతానికి క్షీణించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గణంకాల ప్రకారం.. మే23తో ముగిసిన వారంలో దేశంలో నిరుద్యోగం ఏకంగా 14.73 శాతానికి ఎగిసింది. కరోనాకు ముందే దేశంలో మాంద్యం చోటు చేసుకుందని అనేక రిపోర్టులు వచ్చాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వినిమయ డిమాండ్ దెబ్బతింది. 55 శాతం కుటుంబాల ఆదాయాలు పడిపోయాయి. ఈ అంశాలు ప్రధానంగా జీడీపీ పతనానికి దారి తీశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.