Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక మత సంస్థకు ఇవ్వడమేంటి : ఆయుర్వేద వైద్య నిపుణులు
న్యూఢిల్లీ : 'ఆయుష్-64' ఔషధం పంపిణీ విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) అనుబంధ సంస్థ అయిన 'సేవా భారతి'కి నోడల్ ఏజెన్సీ బాధ్యతలు అప్పజెప్పటం వివాదాస్పదమైంది. కరోనా వైరస్‌బారిన పడినవారికి 'ఆయుష్-64' (ఆయుర్వేద మందు బిళ్లలు) ఔషధం బాగా పనిచేస్తోందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వీటిని అనేక రాష్ట్రాల్లో పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కరోనాపై 'ఆయుష్-64' వాడకంతో ఫలితాలు వస్తాయనటంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని వైద్య నిపుణులు చెబుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదు. 'ఆయుష్-64'పై పెద్దఎత్తున ప్రచారం చేస్తూ, మందు బిళ్లల పంపిణీ బాధ్యతలు 'సేవా భారతి'కి కేంద్రం అప్పజెప్పింది. కోవిడ్ సంక్షోభాన్ని అడ్డుపెట్టుకొని సేవా భారతికి ఆర్థిక లబ్దిచేకూర్చడానికే ఈ నోడల్ ఏజెన్సీ అప్పజెప్పారని కేంద్రంపై ఆరోపణలు వెలువడుతున్నాయి.
అయితే..'ఇది ప్రధాని మోడీ ఉచితంగా ఇస్తున్న మందు' అంటూ సేవా భారతి కార్యకర్తలు పలు రాష్ట్రాల్లో 'ఆయుష్-64'ను పంపిణీ చేయటం రాజకీయంగా దుమారం రేపింది. అర్హతున్న ఆయుర్వేద వైద్యులను పక్కకుపెట్టి, ఒక మత సంస్థకు (సేవా భారతి) ఇలాంటి బాధ్యతలు అప్పజెప్పటం సరైంది కాదని ఆయుర్వేద వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. కోవిడ్-19 సంక్షోభంపై పోరాటాన్ని, రాజకీయాల్ని కేంద్రం కలగలిపిందని కేరళకు చెందిన ఎంపీ జాన్ బ్రిట్టాస్ అన్నారు. 'ఆర్ఎస్ఎస్'కు ప్రభుత్వ బొనాంజా(ఆర్థిక లబ్ది) అందజేయటం కోసమే నోడల్ ఏజెన్సీ అప్పజెప్పారని కేరళకు చెందిన మరో ఎంపీ ఆరోపించారు. మత సంస్థ కార్యకర్తలకు కాకుండా, ఆయుర్వేద డాక్టర్లకు కోవిడ్-19 మందుల పంపిణీ, నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పాలని 'లోక్తాంత్రిక్ జనతాదళ్' ఎంపీ ఎ.వి.శ్రేయాన్స్ కుమార్ వ్యాఖ్యానించారు.