Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మావోయిస్టుల మృతి
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొండగావ్ జిల్లా కుయమారి అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. కొండగావ్ ఎస్పీ సిద్ధార్థ తివారీ ఈ ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు. ధనోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుయమారి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగా అందిన సమాచారం మేరకు డీఆర్టీ జవాన్లు గాలిస్తుండగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నట్టు తెలిపారు. ఇద్దరు మావోయిస్టు మృతదేహాలతోపాటు ఆటోమేటిక్ వెపన్స్, ఇతర నిత్యావసర వినియోగ వస్తువులను ఘటనాస్థలం నుంచి జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు నాలుగు గంటలపైగా జరిగిన ఎదురుకాల్పులు జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యునికి కరోనా పాజిటివ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొరకట్పాడు- వీరాపురం అటవీ ప్రాంతంలో చర్ల పోలీసులు, 141 బీఎన్ సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్‌లో నలుగురు సీపీఐ మావోయిస్ట్ పార్టీ మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఆ నలుగురు సభ్యులను జుడిషీయల్ కస్టడీ నిమిత్తం జైలుకు పంపే క్రమంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒక మిలీషియా సభ్యునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్, చర్ల పోలీసులు నేతృత్వంలో వైద్య సేవలు అందించినట్టు పోలీసు వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. ఆ వ్యక్తికి కోర్టు అనుమతితో భద్రాచలం గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యుల చేత ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్యం అందిస్తున్నట్టుగా తెలిపారు. ఇంకా అనేక మంది మావోయిస్టు పార్టీ దళ సభ్యులు, మిలీషియా సభ్యులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని సదరు అరెస్టు అయిన మిలీషియా సభ్యులు తెలిపారు. మావోయిస్టు పార్టీలోని కొంతమంది నాయకులు, దళ సభ్యులు కరోనా వైరస్ బారిన పడి వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు మాకు సమాచారం అందిందని ఏఎస్పీ తెలిపారు. కరోనా కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ నాయకులు, దళ సభ్యులు ఎవరైనా వైద్య సదుపాయాలను పొందడానికి మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి పోలీసువారి సహాయం పొందవలసినదిగా విజ్ఞప్తి చేశారు.