Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్సీపీసీఆర్
న్యూఢిల్లీ : గతేడాది మార్చి నుంచి కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా అనాథలై, తక్షణమే సంరక్షణ అందాల్సిన పిల్లలు దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది వున్నారని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్)కి చెందిన ఆన్లైన్ ట్రాకింగ్ పోర్టల్ బాల్‌స్వరాజ్ వెల్లడించింది. వారికి సంబంధించిన వివరాలను ఎన్సీపీసీఆర్ మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రోజుల వయస్సు నుండి 17 ఏండ్లవరకు వయస్సున్నవారు వీరిలో వున్నారని తెలిపింది. వీరందరూ కూడా గతేడాది మార్చిలో కరోనా తలెత్తినప్పటి నుండి అనాథలైన వారేనని పేర్కొంది. మే 29 నాటికి ఈ సంఖ్య 9,346 మందిగా వుందని తెలిపింది. ముఖ్యంగా 8 నుంచి 13 ఏండ్ల వారు 3,711 మంది వున్నారనీ, వారికి సాయం అత్యవసరమని పోర్టల్ పేర్కొంది. ఈ పిల్లల సంరక్షణను చేపట్టకపోతే వీరందరూ అక్రమ ట్రాఫికింగ్‌కు బలైపోయే ముప్పు చాలా వుందని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సుప్రీం కోర్టుకు తెలియచేసింది. ఈ పిల్లల వివరాలను అక్రమంగా ప్రయివేటు సంస్థలకు, ఎన్జీఓలకు బదిలీచేస్తున్నారంటూ ప్రభుత్వ అధికారుల ఫిర్యాదులు కూడా ఇప్పటికే చాలా అందాయని తెలిపింది. కరోనా కారణంగా వ్యక్తిగతంగా తీవ్ర నష్టం ఎదుర్కొంటున్న ఈ పిల్లలను కాపాడేందుకు గల మార్గాలను జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన బెంచ్ పరిశీలిస్తోంది. తల్లిదండ్రులను లేదా పోషించే వారిని కరోనా కారణంగా పోగొట్టుకుని వీరందరూ అనాథలయ్యారని అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వల్ల అనాథలైన పిల్లల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు చెప్పాల్సిందిగా మే 28న బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది.