Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్హెచ్ఆర్సీ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్‌కుమార్ మిశ్రా!
- ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం
- అసమ్మతి తెలిపిన ప్రతిపక్ష నేత ఖర్గే
న్యూఢిల్లీ : జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) నూతన చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్‌కుమార్ మిశ్రా నియమితులు కానున్నారు. ఈయన పేరును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించగా, ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ఆమోదం తెలిపింది. అయితే నియామకంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఐదుగురు సభ్యులు ఉండే ఈ సెలక్షన్ కమిటీలో ఒక్కరు మాత్రమే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, మిగిలిన నలుగురు పాలక ఎన్డీఏకి చెందినవారే ఉండడం గమనార్హం. కాగా, అరుణ్‌కుమార్ పేరును ఆమోదంపై మల్లిఖార్జున ఖర్గే అసమ్మతి వ్యక్తం చేశారు. అందుకు గల కారణాలను తెలుపుతూ మోడీకి విడిగా ఒక లేఖను కూడా అందచేశారు. సమావేశానికి ముందుగా చర్చల క్రమం కొరవడడం పట్ల అభ్యంతరం లేవనెత్తారు. దళితుడు, ఆదివాసీ లేదా మైనారిటీల కమ్యూనిటీల నుంచే ఎక్కువ ఫిర్యాదుల వస్తున్నందున ఆ వర్గానికి చెందిన వ్యక్తినే ఎంపిక చేయాలని ఖర్గే సిఫారసు చేసినట్టు సమాచారం. మొత్తంగా 12 మందితో కూడిన జాబితా నుంచి ఈ ఇద్దరు సభ్యులను ఎంపిక చేశారు. ముగ్గురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల పేర్లు కూడా వున్న ఆ జాబితాలో జస్టిస్ మిశ్రా పేరు మాత్రం లేదని హిందూ పేర్కొంది. సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి కాకుండా మరో వ్యక్తిని ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ గా నియమించడం గత 27 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. మోడీతో పాటు ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఖర్గెలు ఉంటారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఈ సెలక్షన్ కమిటీ, జస్టిస్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు సభ్యులు-మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మహేష్ మిట్టల్ కుమార్‌లకు ఆమోద ముద్ర వేసింది.
మోడీని ప్రశంసల్లో మంచెత్తిన అరుణ్‌కుమార్
ప్రధాని మోడీని పలు విధాలుగా, పలు సందర్భాల్లో ప్రశంసల్లో ముంచెత్తితేనో, లేదా ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులిచ్చే వారిని ప్రభుత్వం అందలమెక్కి స్తోంది. పదవుల పరంగానో లేదా, ఇతర విధంగానో బహు మతి ఇస్తోంది. ఈ కోవలోనే దశాబ్ధాలుగా నలుగుతున్న అయోధ్య అంశంలో కాషాయ పార్టీకి అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరును రాజ్యసభ ఎంపీగా కేంద్రం నామినేట్ చేసింది. ఆయనపై ఆత్యాచార ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో వివాదాస్పద సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తికి కీలకమైన జాతీయ మానవ హక్కుల కమిషన్ చీఫ్ పదవికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ వివాదాస్పద వ్యక్తి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా. ఈయన గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన గొప్ప దూరదృష్టి గల నేత అని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసల్లో ముంచెత్తారు. అప్పట్లో అరుణ్‌కుమార్ మిశ్రాపై మాజీ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులతో పాటు పలు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కోర్టు లకు ఉన్న స్వతంత్రకు ముప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ నుంచి అరుణ్‌కుమార్ మిశ్రా తప్పుకోవాలన్న డిమాండ్ కూడా వచ్చింది. మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు 2020 డిసెంబర్లో పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ఎంపిక జరగ లేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ చంద్ర పంత్ ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కాగా, జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2020 సెప్టెంబర్ 2న పదవీ విరమణ చేశారు.