Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ లేఖ
న్యూఢిల్లీ : కేంద్రం అమలుజేస్తున్న వ్యాక్సిన్ పంపిణీ విధానంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కేటాయింపుల్లో కేంద్రం ఏమాత్రం పారదర్శకత పాటించటం లేదని సోరెన్ ఆరోపించారు. రాష్ట్రాలే సొంతంగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారని సోరెన్ అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో 18-44ఏండ్ల మధ్య వయసు వారికి కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకాలు అందజేయాలని కోరుతూ హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. కేంద్రం నుంచి సరిపడా టీకా డోసులు జార్ఖండ్‌కు అందడం లేదని సోరెన్ తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇది పెద్ద అవరోధంగా మారిందని పేర్కొన్నారు. యావత్ దేశం కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న సమయంలో టీకాల సమీకరణ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. కరోనా రెండో దశ విజృంభణతో జార్ఖండ్ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని సోరెన్ తెలిపారు. మహమ్మారిని అదుపు చేయాలంటే ప్రతి ఒక్కరికీ టీకా అందించడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్రాలకు అందుతున్న టీకా ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.18-44 ఏండ్ల మధ్య వయసు వారికి టీకాలు వేయాలంటే దాదాపు రూ.1100కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. కానీ కరోనా వల్ల ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న తమ ఆర్థిక వ్యవస్థకు ఇది పెనుభారంగా మారే అవకాశముందని తెలిపారు. కావున కేంద్రమే ఈ వర్గానికి టీకాలు ఉచితంగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో 12-18ఏండ్ల వయసు వారికి కూడా టీకాలు అందించేందుకు అనుమతులు వస్తే, మరో రూ.1000 కోట్లు అవసరం అవుతుందని లేఖలో ప్రస్తావించారు.