Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించండి: కేంద్రానికి ఏఐఏడబ్ల్యూయూ డిమాండ్
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామీణ భారతంపై దృష్టి సారించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం( ఏఐఏడబ్ల్యూయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్థన్కు ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.వెంకట్, విజయరాఘవన్, రాజ్యసభ ఎంపి శివదాసన్ ఘాటు లేఖ రాశారు. కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో గ్రామీణ భారతం సమస్యలను లేఖలో నొక్కిచెప్పారు. కోవిడ్ -19 కారణంగా గ్రామీణ భారతదేశంలో తలెత్తిన తీవ్రమైన ఆరోగ్య పరిస్థితిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామీణ భారతంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందనీ, ఇది అక్కడ సంక్షోభ పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మే నెలలో దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో 65 శాతానికి పైగా కేసులు నమోదు అయ్యాయని, పట్టణ, చిన్న పట్టణ ప్రాంతాలు వరుసగా 13 శాతం, 22 శాతం మాత్రమే ఉన్నాయని గణాంకాలు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో నిర్వహించిన పరీక్షలను పరిశీలిస్తే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చన్నారు. అనేక న్యూస్ రిపోర్టులు, ప్రభుత్వ గణాంకాల ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. కరోనాతో జీవనోపాధిని కోల్పోయిన ప్రజలకు వివిధ మార్గాల్లో ఎఐఎడబ్ల్యుయు సాయం చేసిందని, ఆహార పదార్థాలు, నిత్యావసరాలు అందించడం వంటి చర్యలు దేశవ్యాప్తంగా నిర్వహించామన్నారు.
అందరికీ ఉచిత టీకాలు
దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్లు అందించాలని ఏఐఏడబ్ల్యూయూ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ అస్పష్టమైన టీకా విధానం ఫలితంగా వ్యాక్సిన్ విషయంలో దేశ ప్రజలు వివక్ష ఎదుర్కొంటున్నారని పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా నెమ్మదిగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని మరింత పరిమితం చేశారని పేర్కొంది. పట్టణ జనాభాతో పోల్చితే గ్రామీణులకు వ్యాక్సిన్లు చాలా తక్కువ శాతం అందించారని తెలిపింది. టీకా పంపిణీని సరళీకతం చేయటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ల ప్రయోజనాలకు మాత్రమేనని ఏఐఏడబ్ల్యూయూ విమర్శించింది. వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వ కొనుగోలు చేసి పంపిణీ చేయకుండా బాధ్యతల నుంచి తప్పుకుంటోందని, తద్వారా రాష్ట్రాలపై భారాలు మోపుతోందని దుయ్యబట్టింది. వ్యాక్సిన్ కోసం తీసుకొచ్చిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గ్రామీణ ప్రాంత ప్రజలను టీకా పొందకుండా నిరోధిస్తోందని పేర్కొంది. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికీ వేగంగా టీకాలు వేసేందుకు మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
ఆర్థిక సాయం అందించాలి
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరీక్షల రేటు చాలా తక్కువగా ఉందని, తగిన చర్యలు తీసుకొని పరీక్షల సంఖ్యను పెంచాలని ఏఐఏడబ్ల్యూయూ డిమాండ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా సోకిన వారు.. వారి చిన్నచిన్న ఇండ్లల్లో హోంఐసోలేషన్లో ఉండేందుకు అవకాశం లేనందున, విడిగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాట చేయాలని సూచించింది. కరోనా నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆదాయపు పన్ను పరిధికి వెలుపల ఉన్న అన్ని కుటుంబాలకు నెలకు రూ.7,500 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఎఐఎడబ్ల్యుయు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని పేర్కొంది.