Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిక్స్ దేశాల మద్దతు
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిపై సమిష్టి పోరుకు కరోనా టీకాలపై మేథోహక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలని భారత్, దక్షిణాఫ్రికాలు ప్రతిపాదించాయి. ప్రపంచ దేశాలన్నిటికీ టీకాలను సమానంగా అందుబాటులోకి తీసుకురావాలని, టీకాల పంపిణీ, ధరల విధానంలోనూ పారదర్శకత ఉండాలని పేర్కొన్నాయి. భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు 5 దేశాలతో కూడిన బ్రిక్స్ మద్దతిచ్చింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం మంగళవారం వర్చువల్గా జరిగింది. ఆతిథ్య దేశ హోదాలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఈ భేటీకి అధ్యక్షత వహించారు. కరోనా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొవడంపై ఈ సమావేశం విస్తృతంగా చర్చించింది. ప్రపంచ ప్రజల ఆరోగ్య పరిరక్షణ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల ప్రజల ప్రాణాల రక్షణకు టీకాల కార్యక్రమాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగాలైన భద్రతా సమితి, సర్వప్రతినిధి సభ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థల్లో సమూల సంస్కరణలను డిమాండ్ చేస్తూ బ్రిక్స్ సమావేశం తీర్మానం చేయడం మరో కీలకమైన పరిణామం.