Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారతీయులందరికీ యూనివర్శల్ వ్యాక్సినేషన్ అందించేలా ప్రభుత్వ విధానంలో మార్పులు చేయాలంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తాను కరోనాతో బాధపడుతున్నానని, ప్రజలు తనలా బాధపడకూడదని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం కరోనా సోకిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బెడ్ మీద నుండే బుధవారం ఈ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. కోవిడ్ పడక మీద నుంచే ఆయన ఈసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ డిసెంబర్ కల్లా వ్యాక్సిన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిందని, అయితే వ్యాక్సిన్ల కొరత చూస్తుంటే.. ఇది ఎలా సాధ్యమనే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. రాష్ట్రాలే వ్యాక్సిన్ సేకరించుకోవాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని శశిథరూర్ పేర్కొన్నారు. భారతీయులందరికీ యూనివర్శల్ వ్యాక్సినేషన్ అందించేలా ప్రభుత్వ విధానంలో మార్పులు చేయాలంటూ కాంగ్రెస్ చేపట్టిన విస్తత ప్రచారానికి తాను మద్దతిస్తున్నానని అన్నారు. డిసెంబర్‌లోగా దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు.