Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నయా ఉదారవాద విధానాల ఫలితమిది..
- విద్య, వైద్యంలో లోపాల్ని బహిర్గతం చేసిన కరోనా మహమ్మారి
- లింగ వివక్ష, ఆదాయ అసమానతల్ని పెంచిన ప్రయివేటీకరణ : రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు
దేశంలో లక్షలాది మంది కరోనా రోగులు ఆశ్రయిస్తున్నది ప్రభుత్వ ఆసుపత్రుల్నే. అయితే అక్కడ..ఔషధాలలేమి, సిబ్బంది కొరత ఉన్నా.. ప్రభుత్వ హాస్పిటల్సే కోవిడ్ సంక్షోభం భారం మోస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారు. అన్నింటా ప్రయివేటీకరణను నమ్ముకున్న మన పాలకులకు ఈ సంక్షోభ సమయాన ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ వైద్యులే దిక్కయ్యారని అర్థమవుతోంది. కరోనా సంక్షోభం..మనదేశ అభివృద్ధి విధానాల్లో లోపాల్ని బయటపెట్టిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నయా ఉదారవాద, ప్రయివేటీకరణ విధానాల వల్లే భారత్ కరోనా సంక్షోభం ఎదుర్కొలేకపోతున్న దని వారు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ : కొన్ని దశాబ్దాలుగా వైద్యరంగంలో ప్రభుత్వ వ్యయం తగ్గిపోవటం, ప్రయివేటుకు బాటలు వేయటం ఎలాంటి ఫలితాల్ని ఇస్తుందో భారత్‌ను ఉదాహరణగా చూపొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ వైద్యంపై ముందు నుంచే దృష్టిసారించి ఉంటే కరోనాను నియంత్రించటంలో భారత్ మెరుగైన ఫలితాలు వచ్చేవని వారు చెబుతున్నారు. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, లింగ సమానత, తాగునీరు, పారిశుద్ధ్యం...ఇలాంటి 17 అంశాల్ని 'స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు'గా(ఎస్డీజీ) ఐక్యరాజ్యసమితి (2015లో) పేర్కొంది. వీటిని 2030కల్లా సాధించాలని ఐరాస సభ్యదేశాలన్నీ (భారత్ సహా) తీర్మానంపై సంతకాలు చేశాయి. భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కోబోయే పర్యావరణ, రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఢకొీట్టాలంటే సభ్య దేశాలు ఎస్డీజీలను చేరుకోవాలని ఐరాస పేర్కొంది. అయితే ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ విధానాల్ని అమలుజేస్తున్న భారత్ 'ఎస్డీజీ'లను సాధించటం కాదు కదా..వాటికి సమీపంగా కూడా వెళ్లలేదని నిపుణులు భావిస్తున్నారు.
పర్యావరణ మార్పు
ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి 'భూతాపం'. అంటే భూవాతావరణం వేడెక్కడం. వాతావరణంలో ప్రస్తుతం పోగైన కార్బన్‌డయాక్సైడ్‌లో 50శాతం గత 30ఏండ్లలో ఏర్పడింది. ఇందులో 33శాతం కార్బన్‌డయాక్సైడ్‌కు కారణం 20 ఇంధన, సిమెంట్ తయారీ కంపెనీలేని గణాంకాలు చెబుతున్నాయి. వివిధ దేశాల్లో ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణే ఇందుకు కారణమని విమర్శలున్నాయి. ఇంధనం, సిమెంట్ తయారీ రంగాల నుంచి ప్రభుత్వం తప్పుకొని ప్రయివేటుకు బాటలు వేయటం వల్లే పెట్టుబడులు మరలాయని, కాలుష్యం పెరగడానికి దారితీసిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి అభివృద్ధి విధానాల వల్ల మన జీవవైవిధ్యాన్ని సైతం దెబ్బ తీసుకుంటున్నామని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూమి వినియోగం
పారిశ్రామిక అభివృద్ధి పేరుతో మనదేశంలో పాలకులు పెద్ద ఎత్తున భూముల్ని ప్రయివేటు కంపెనీలకు అప్పజెబుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం అండమాన్ నికోబార్ దీవుల్లో, లక్షద్వీప్‌లో మోడీ సర్కార్ ఏకంగా చట్టాల్నే మార్చింది. ఢిల్లీలో కేంద్రం చేపట్టిన 'సెంట్రల్ విస్టా' ప్రాజెక్టూ అలాంటిదే. పర్యావరణ నిబంధనల్ని మార్చేసి, ప్రాజెక్టులను ప్రయివేటు నిర్మాణరంగ కంపెనీలకు అప్పజెబుతున్నారు. పర్యావరణమార్పు, న్యాయం అనేవి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. దీనికి అసమానతలకు, లింగ వివక్షకు సంబంధముందని నిపుణులు చెబుతున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాలు అమలుజేయటం వల్లే కార్పొరేటీకరణ బలం పుంజుకుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అసమానతలు పెరగడానికే ఇదే ముఖ్యకారణమని వారు అన్నారు. ఈ విధానాల్లో సమూల మార్పు రానంతవరకూ దేశంలో పేదరికం, లింగ వివక్ష, మహళలపై అణచివేత పోదని సామాజికవేత్తలు చెబుతున్నారు.
ప్రతీదీ..కొనాల్సిందే..
విద్య, వైద్యం, భూమి, తాగునీరు.. ఇలా ప్రతిదీ ప్రయివేటీకరణ దిశగా వెళ్తోంది. విద్య, వైద్యరంగాల్లో కార్పొరేట్ కంపెనీలు ఎలా చెలరేగిపోతున్నాయో అందరికీ కనపడుతోంది. లింగ వివక్ష, మహిళలను చిన్నచూపు చూడటం వంటివి పెరగడానికి దారి తీసిందని, ఇవి మనదేశంలో తీవ్రరూపం దాల్చాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. నేడు మనదేశంలో సామాన్య పౌరుడికి అవసరమయ్యే ప్రతీదీ (విద్య, వైద్యం, నీరు...) మార్కెట్ సరుకుగా మారింది. నగరాల్లో పాలకులు ఎంచుకున్న అభివృద్ధి నమూనాలు ఆదాయ అసమానతలకు దారితీసింది.
ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలు, ఎస్ఈజెడ్ల ద్వారా వందల ఎకరాల భూమి, సబ్సిడీతో కూడిన విద్యుత్, నీరు..ఇతర సౌకర్యాలు కార్పొరేట్ కంపెనీలకు అందుబాటులోకి వచ్చాయంటే దానికి కారణం ప్రయివేటీకరణ. వేల కోట్ల రూపాయల పన్ను ప్రయోజనాల్ని మోడీ సర్కార్ కల్పిస్తోంది.
ప్రభుత్వరంగంలో వ్యయం తగ్గటమే అసమా నతలు తీవ్రస్థాయికి తీసుకెళ్లాయని భారత్‌పై విడుదలైన అనేక నివేదికలు పేర్కొన్నాయి. ఈ సంక్షోభ సమయాన ప్రభుత్వాలు ఎంచుకున్న అభివృద్ధి విధానాలు కాపాడాయా? లేదా? అన్నది సమీక్షించుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.