Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ పన్నుల్లో విస్మయం
- పెరిగిన వ్యక్తిగత పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ : దేశంలో కార్పొరేట్లు, పారిశ్రామి కవేత్తల సంపద రెట్టింపు అయ్యిందనీ అనేక రిపోర్ట్లు వస్తోన్నప్పటికీ.. మరోవైపు ఆ వర్గాలు చెల్లించే పన్నుల్లో మాత్రం తగ్గుదల చోటు చేసుకుంది. మరోవైపు వ్యక్తిగత పన్ను వసూళ్లు కార్పొరేట్ల టాక్స్‌ల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఇలా జరగడం చరిత్రలోనే తొలిసారి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల నుంచి వచ్చే పన్ను వసూళ్లలో 18 శాతం క్షీణత చోటు చేసుకోవడాన్ని విస్మయాన్ని కలిగిస్తోంది. కాగా వ్యక్తిగత పన్ను వసూళ్లులో 2.3 శాతం తగ్గుదలతో రూ.4.69 లక్షల కోట్లు నమోదయ్యాయి. కార్పొరేట్ల పన్నులు రూ.4.57 లక్షల కోట్లకు తగ్గాయి. కంపెనీల లాభాలపై కార్పొరేట్ పన్నును విధిస్తారు. వ్యక్తుల ఆదాయాలపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్ల పన్నులపై దాదాపుగా 10 శాతం పాయింట్ల మేర తగ్గించింది. ప్రస్తుత కంపెనీలపై పన్నులు 25 శాతానికి, తయారీ రంగంలోని కొత్త కంపెనీలపై 17 శాతానికి తగ్గించింది. కార్పొరేట్లపై పన్ను శాతాన్ని తగ్గించడం, మరోవైపు జీడీపీ పడిపోవడంతో ట్యాక్స్ వసూళ్లు తగ్గాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్శిటీ బెంగళూరు వైస్ ఛాన్స్లర్ ఎన్ఆర్ భానుమూర్తి తెలిపారు.
రెండేండ్ల నుంచే..
వరుసగా రెండేండ్ల నుంచి కార్పొరేట్లు చెల్లించే పన్నులు తగ్గుతున్నాయి. 2018-19లో రూ.6.6 లక్షల కోట్ల పన్నులు వసూళ్లయ్యాయి. కాగా.. 2019-20లో ఈ వర్గం నుంచి వచ్చే పన్నుల్లో 16 శాతం, 2020-21లో 18 శాతం చొప్పున తగ్గాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 15 లక్షల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. ఇందులో రూ.5 లక్షలు పైబడిన ఆదాయం కలిగిన వారు 13 శాతం మంది ఉన్నారు. మిగితా 87 శాతం మంది రూ.5 లక్షల దిగువన ఆదాయం కలిగిన వారు.
కరోనాలోనూ కాసులు పోగేశారు..
కరోనా సంక్షోభంలోనూ దేశంలో కుబేరుల సంఖ్య గణనీయంగా పెరి గింది. ఫోర్బ్స్ గణంకాల ప్రకారం.. 2021 మార్చి ముగింపు నాటికి బిలియ నీర్ల సంఖ్య 140కి చేరింది. ఇంతక్రితం ఏడాది 102 మంది కుబేరులు ఉన్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే వేల కోట్ల ఆదాయానికి చేరిన కొత్త వారి సంఖ్య 38 మందిగా నమోదయ్యింది. వీళ్లంతా పారిశ్రామికవేత్తలే. వీరందరి సంపద 596 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.45 లక్షల కోట్ల)గా ఉంది. ఇంతక్రితం ఏడాది 313 బిలియన్ డాలర్లతో పోల్చితే వీరి సంపద రెట్టింపు అయ్యింది. అదానీ, అంబానీల సంపద అమాంతం పెరిగిపోయింది. సంక్షోభ కాలంలోనూ భారత పారిశ్రామికవేత్తలు భారీగా సంపాదించినప్పటికీ.. పన్ను చెల్లింపుల్లో క్షీణత చోటు చేసుకోవడం గమనార్హం.