Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ హక్కులకు భంగం కలిగినప్పుడు జ్యోక్యమే
- వ్యాక్సిన్ లెక్కలివ్వండి.. రూ.35వేల కోట్ల ఫండ్ ఎక్కడ ఖర్చుపెట్టారు ?
- బ్లాక్‌ఫంగస్ కట్టడికి చర్యలేంటీ : కేంద్రంపై సుప్రీం ప్రశ్నల వర్షం..
కార్యనిర్వాహక వ్యవస్థ విధానాలపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదన్న కేంద్రం వాదనపై సుప్రీం తీవ్రంగా స్పందించింది. కార్యనిర్వాహక విధానాల వల్ల పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఘాటుగా వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీం బుధవారం విచారణ చేపట్టింది. వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతున్న తీరు.. బ్లాక్ ఫంగస్ కట్టడి తీసుకుంటున్న చర్యల గురించి మోడీ సర్కార్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నలవర్షం కురిపించింది.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సమయంలో మందులు, ఔషధం, ఆక్సిజన్ టీకా విషయంలో సుప్రీంకోర్టు బుధవారం కేంద్రానికి ముఖ్యమైన ప్రశ్నలు అడిగింది. టీకా కోసం రూ.35 వేల కోట్ల బడ్జెట్‌ను ఉంచారు. ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు..? ఎక్కడ ఖర్చు చేశారు? వ్యాక్సిన్‌కు సంబంధించిన గణాంక వివరాలన్నీ సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. బ్లాక్ ఫంగస్ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. మందులకు సంబంధించి ప్రణాళిక ఏమైనా ఉన్నదా? అంటూ ప్రశ్నించింది. జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎల్.ఎన్.రావు, జస్టిస్ ఎస్.ఆర్ భట్‌తో కూడిన ధర్మాసనం కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానం అశాస్త్రీయంగా ఉన్నదని పేర్కొంది.
ఆరు అంశాల వారీగా సమాధానాలివ్వాలన్న ధర్మాసనం..
1. టీకా నిధి ఎలా ఖర్చు చేశారు..
టీకాలు వేయడం చాలా ముఖ్యమైన విషయం. ఇది కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సవాల్. టీకా కోసం ఈ ఏడాది రూ.35 వేల కోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. అయితే ఈ నిధిని ఇప్పటివరకు ఎలా ఖర్చు చేశారో కేంద్రం స్పష్టం చేయాలి. 18-44 ఏండ్ల వయస్సు గలవారికి ఉచిత వ్యాక్సిన్‌కు ఆ నిధుల్ని ఎందుకు ఉపయోగించలేదు.
2. వచ్చిన టీకా ఎంత..? పూర్తి డేటా ఇవ్వాలి..
మొదటి, రెండు, మూడవ దశల్లో ఎంత మందికి టీకాలు వేయడానికి అర్హత ఉన్నది. ఇప్పటివరకు వీరిలో ఎంత మందికి టీకాలు వేయించారు. వీటిలో సింగిల్ డోస్ , డబుల్ డోస్ ఇచ్చిన రెండింటినీ వివరాలు చేర్చాలి. వీటిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జనాభాకు ఇచ్చిన వ్యాక్సిన్ ఎంత..? పూర్తి వివరాలు సమర్పించాలి.
3. వ్యాక్సిన్ గణాంకాలు ఇవ్వాలి..
కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వీ టీకాలను ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు చేశారు.? వ్యాక్సిన్ కోసం ఆర్డర్ చేసిన తేదీ, ఆర్డర్ చేసిన టీకా పరిమాణం, సరఫరా అయ్యే సమాచారాన్ని అందజేయాలి.
4. ఇంకా మిగిలిన జనాభాకు టీకా ఎలా..?
ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని జనాభాకు టీకాలు వేస్తామని కేంద్రం తెలిపింది. మొదటి, రెండు, మూడవ దశల్లో టీకాలు పొందనివారికి టీకాలు వేయాలి. మొదటి, రెండు, మూడు, నాలుగు దశల్లో టీకా ఎలా వేశారో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.
5. ఉచిత టీకాపై రాష్ట్రాలతీరేంటీ..?
తొలి రెండు విడతల్లో కేంద్రం వ్యాక్సిన్లను ఉచితంగానే అందించిందని గుర్తు చేసింది. ఆ తర్వాత నుంచి 18-44 మధ్య వయస్సు గలవారికి టీకా వేయకుండా కేంద్రం తప్పించుకుంటున్న తీరుపై సుప్రీం ఆక్షేపించింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు ఆసుపత్రులు వ్యాక్సిన్లను కొనుగోలు చేసి, ప్రజల నుంచి కొంత మొత్తం వసూలు చేసి టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమతించడం సహేతుకం కాదని సుప్రీం స్పష్టం చేసింది.
తమ ప్రజలకు ఉచిత టీకాలు వేయడానికి రాష్ట్రాలు అంగీకరిస్తే, అది విలువల విషయంగా మారుతుంది. అలాంటపుడు ఈ విధానం రాష్ట్రాలకు ప్రతిస్పందనగా చెప్పాలి, తద్వారా ఆయా రాష్ట్ర ప్రజలు టీకా కేంద్రంలో ఉచిత టీకాలు వేసే హక్కును పొందుతారని కచ్చితంగా తెలుసుకోవచ్చు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలను రెండు వారాల్లో తెలియజేయాలి. ఆ రాష్ట్రాలు విధాన నిర్ణయాలెంటో ప్రకటించాలి.
18-44 ఏండ్ల వారికి టీకాపై తీవ్రమైన వ్యాఖ్యలు
''నివేదికలను పరిశీలిస్తే 18-44 ఏండ్ల మధ్య వయస్సు వారికి వైరస్ సోకడమే కాదు.. కొంతమందిపై తీవ్ర ప్రభావమూ చూపిస్తున్నట్టు తెలుస్తున్నది. రోజుల కొద్దీ ఆసుపత్రుల్లో ఉండాల్సిన పరిస్థితులూ ఎదురవుతున్నాయి. కొన్ని మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వైరస్‌లో మార్పులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో 18-44 వయస్సు వారికి కూడా వ్యాక్సిన్ వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది శాస్త్రీయపద్ధతుల ద్వారా నిర్ణయించాలి'' అని సుప్రీం స్పష్టం చేసింది.
6. పాలసీ పత్రాలు ఇవ్వండి
కోవిడ్ టీకా విధానంపై కేంద్రం ఆలోచనను చూపించే అన్ని అవసరమైన పత్రాలను కోర్టు ముందు ఉంచాలి.
టీకా ధరలపై నిలదీత..
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రయివేట్ ఆసుపత్రులు ముందుగా నిర్ణయించిన ధరలకు 50శాతం వ్యాక్సిన్‌ను పొందుతాయి. ప్రయివేటు తయారీదారులను తీసుకురావడానికి ధరల విధానం అమలు చేయబడిందని కేంద్రం వాదించింది.
ముందుగా నిర్ణయించిన ధరను చర్చించడానికి ఇద్దరు తయారీదారులు మాత్రమే ఉన్నప్పుడు ఈ వాదన ఎంత స్థిరంగా ఉంటుంది? మరోవైపు ఎక్కువ పరిమాణాన్ని ఆర్డర్ చేస్తున్నందున తక్కువ ధరలకు టీకాను పొందుతున్నామని కేంద్రం చెబుతున్నది. అలాంటపుడు ప్రతి నెల 100 శాతం మోతాదులో ఎందుకు కొనరు అనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తున్నది.