Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. జాతీయ ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులను ఎస్సి, ఎస్టి, ఇతర చెల్లింపుల కింద విభజించాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు 'సలహా' జారీ చేసింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 2న జారీ చేసిన ఈ ఉత్తర్వుల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలాంటి సంప్రదింపులు, ఎలాంటి వివరణలు, ఎలాంటి హేతుబద్ధత లేకుండా కేంద్రం జారీ చేసిన ఈ ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సంఘాలు, వ్యక్తులు ఎన్ఆర్ఇజిఎ సంఘర్ష్ మోర్చా కింద ఐక్యంగా ఏర్పడి ఈ 'సలహా'ను వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే ఈ 'సలహా'ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర తోమర్‌కు లేఖ రాసారు. ఒకే వేతనానికి అర్హత ఉన్న కార్మికులను ఈ విధంగా విభజించడంలో అర్ధమే లేదు, గతంలో చెల్లింపు పద్ధతిని మార్చిన ప్రతిసారీ, కార్మికులు ఆలస్యమైన వేతన చెల్లింపుతో బాధపడుతున్నారని లేఖలో తెలిపారు. ఇప్పుడు కూడా, పని ప్రదేశాలలో కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా ప్రత్యక్ష చెల్లింపు ప్రవేశపెట్టిన 12 సంవత్సరాల తరువాత కూడా పని పూర్తయిన 15 రోజుల తరువాత వేతనాలు చెల్లించబడడం లేదని లేఖలో గుర్తు చేశారు. ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న చెల్లింపు విధానాన్ని మరింత క్లిష్టంగా మార్చడం తప్ప, ఈ చర్యతో ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపారు.