Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి నీతి అయోగ్ జాబితా
న్యూఢిల్లీ : దేశంలో ఓ వైపు కరోనా విజృంభణతో లక్షలాది ప్రజల ప్రాణాలు పోతుంటే.. మరోవైపు కార్పొరేట్ల కోసం మోడీ సర్కార్ బ్యాంక్‌ల ప్రయివేటీకరణను వేగవంతం చేసింది. ఆయా బ్యాంక్‌లకు సంబంధించిన పేర్లను నీతి అయోగ్ ఖరారు చేసింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా 2021-22 బడ్జెట్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంక్ (పిఎస్బి)లు, ఒక సాధారణ బీమా కంపెనీని కేంద్రం ప్రయివేటు శక్తులకు విక్రయించాలని నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. పిఎస్‌బిల ప్రయివేటీకరణకు సంబంధించిన పేర్లను పెట్టుబడుల ఉపసంహరణ కీలక సెక్రటరీల గ్రూపునకు నీతి అయోగ్ అందించిందని ఓ అధికారి తెలిపారు. ఈ కమిటీలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, రెవెన్యూ సెక్రటరీ, కార్పొరేట్ ఎఫైర్స్, లీగల్ ఎఫైర్స్, దీపమ్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కార్యదర్శులు ఉన్నారు. కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్న ఈ కోర్ గ్రూప్ కమిటీ ఆమోదం తర్వాత ప్రధానీ మోడీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ తుది ఆమోదం తెలుపనుంది. కేబినెట్ అనుమతి తర్వాత ప్రయివేటీకరణ విధాన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రయివేటీకరణకు వీలుగా నాలుగు బ్యాంక్‌లను షార్ట్ లిస్టు చేసిందని ఇది వరకు రాయిటర్స్ పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా(బిఒఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఒసి), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర పిఎస్బిలు ఈ జాబితాలో ఉన్నాయని సమాచారం. బిఒఎం చిన్నది కావడంతో ఆ బ్యాంక్‌ను తొలుత ప్రయివేటీకరించడానికి ఎక్కువ అవకాశాలున్నా యని అధికార వర్గాల సమాచారం. బిఒఐలో ప్రస్తుతం 50వేలు పైగా, సెంట్రల్ బ్యాంక్‌లో 33వేల మేర, ఐఒబిలో 26వేలు, బిఒఎంలో 13వేల చొప్పున ఉద్యోగులు పని చేసున్నారని అంచనా.