Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీరిలో అత్యధికం వలస కార్మికులే : భారతీయ రైల్వే
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి.. భారత్‌లో సెకండ్‌వేవ్‌తో పంజా విసురుతోంది. అయితే, గతేడాదిలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా దేశ ప్రజలు.. ముఖ్యంగా వలస జీవులు పడిన ఇబ్బందులు.. వెతలు వర్ణనాతీతం. అత్యంత దారుణ పరిస్థితుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కోట్లాది మంది తినడానికి తిండి, తాగడానికి నీరు, రవాణా సౌకర్యలు లేని నేపథ్యంలో కాలినడకనే సొంతుళ్లకు బయలుదేరారు. తమ గమ్యస్థానాలను చేరకుండానే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరీ ముఖ్యంగా రైలు పట్టాల గుండా ప్రయాణం సాగిస్తూ.. ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం. 2020లో దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై 8,733 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధిక శాతం మంది వలస కార్మికులేనని భారతీయ రైల్వే వెల్లడించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు రైల్వే బోర్డు తాజాగా సమాధానమిచ్చింది. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు రైలు పట్టాలపై 8,733 మంది మరణించారనీ, 805 మంది గాయపడ్డారని పేర్కొంది.
దీనికి ప్రధాన కారణం రోడ్లతో పోలిస్తే రైల్వే మార్గాలపై ప్రయాణం తక్కువ దూరం కావడం, అలాగే, రోడ్లపై పోలీసుల నిఘా అధికంగా ఉండడంతో చాలామంది రైల్వే ట్రాకులపై నడుస్తూ సొంతూళ్లకు వెళ్లడానికి ఈ మార్గాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే పట్టాలపై కాలినడకన వెళ్తూ చాలామంది మార్గంమధ్యలో వివిధ కారణాలతో చనిపోయారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, రైల్వే వెల్లడించిన గణాంకాల ప్రకారం 2016-2019 మధ్య కాలంలో మొత్తంగా 56,271 మంది ఇలాంటి ఘటనల కారణంగా మరణించారు. అలాగే, 5,938 మంది గాయపడ్డారు. ఇక 2016లో 14,032 మంది, 2017లో 12,838 మంది, 2018లో 14,197 మంది, 2019లో 15,204 మంది రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయారు.