Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా నేతల విమర్శ
న్యూఢిల్లీ : తెహల్కా డాట్ కామ్ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇటీవల గోవాలోని మపుసా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు దిగ్భ్రాంతి కలిగించిందనీ, తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందని పలు మహిళా సంఘాల నేతలు, గ్రూపులు, జర్నలిస్టులు, అధ్యాపకులు, వివిధ స్థాయిల్లోని మహిళా నేతలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనపై సంతకాలు చేసిన 300 మందికి పైగా నేతల్లో ఐద్వా అధ్యక్షురాలు మాలిని భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి మరియం ధావలె, కవితా కృష్ణన్(ఏఐపీడబ్ల్యూఏ), మాజీ ఎంపీలు సుభాషిణి అలీ, పికె.శ్రీమతి టీచర్, జర్నలిస్టులు, వివిధ సంఘాలకు చెందిన నేతలు ఉన్నారు. అత్యాచారాలకు గురైన మహిళలు చేసే పోరాటాలకు ఈ తీర్పు ఒక అవరోధంగా నిలుస్తుందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. లైంగిక దాడిని ఎదుర్కొని బయటపడిన బాధితురాలు కోర్టు గదిలో అత్యంత అమానుషమైన వాతావరణాన్ని ఎదుర్కొంటుందని ఈ తీర్పుతో రుజువైందని అన్నారు. ఫిర్యాదు చేసిన మహిళ చాలా దారుణమైన రీతిలో అసంబద్ధమైన, అక్రమమైన, కుట్రతో కూడిన క్రాస్ ఎగ్జామినేషన్‌ను ఎదుర్కొనాల్సి వస్తుందని ఈ కేసు రుజువు చేసిందని పేర్కొన్నారు.
తెహెల్కాలో జూనియర్ ఉద్యోగిగా పనిచేసే బాధితురాలు 2013 నవంబరు 7, 8 తేదీల్లో గోవాలో సాహిత్య సభల సందర్భంగా తనకు అప్పగించిన విధి నిర్వహణలో భాగంగా లైంగిక దాడికి, అవమానాలకు గురైంది. గోవా పోలీసు స్టేషన్లో ఆమె తరుణ్ తేజ్పాల్పై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తేజ్పాల్ను విచారించడానికి బదులుగా ఆమె కోర్టు గదిలో తీవ్ర స్థాయిలో విచారణను ఎదుర్కొనాల్సి వచ్చింది. బాధితురాలు ఈ సంఘటన తర్వాత పేరున్న సీనియర్ న్యాయవాదులతో సహా పలువురు లాయర్లను, జాతీయ మహిళా కమిషన్ అధికారులను కలిసి మాట్లాడారనీ, దీనివల్ల సాక్ష్యాధారాలు తారుమారై వుండవచ్చని, అందువల్ల ముందుగా ఆ కోణంలో బాధితురాలిని విచారించాల్సి వుందని మపుసా అదనపు సెషన్స్ జడ్జిగారు నిర్ధారించారు. కానీ చట్ట ప్రకారం, ఏ నేరంలోనైనా బాధితులకు ఏ న్యాయవాదినైనా సంప్రదించగలిగే స్వతంత్ర, తోసిపుచ్చలేని హక్కు వుంది. తమకు తెలిసిన వారిని సాయం కోసం ఆశ్రయించడం చాలా సర్వసాధారణం. ఈ కేసులో ఇందుకు సంబంధించి న్యాయమూర్తి ప్రతికూలమైన వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరమని, అసంబద్ధమని వారు పేర్కొన్నారు. బాధితురాలి కోణంలో చూసినా, సంప్రదించిన నిపుణుల కోణంలో చూసినా ఇలా మాట్లాడడం ఏమాత్రమూ తగదని అన్నారు.
ఈ కేసులో చట్ట నిబంధనలకు విరుద్ధంగా బాధితురాలి పేరు, ఆమె భాగస్వామి పేరు, ఇ మెయిల్ అడ్రస్‌లతో సహా ప్రతీ వ్యక్తిగత వివరాన్ని వెల్లడించారు. ఈ సమాచారమంతా తొలగించాలని ఇప్పటికే ట్రయల్ కోర్టును హైకోర్టు కోరింది కూడా. ఇటువంటి తీర్పులు మహిళలు తమపై జరిగిన లైంగిక దాడుల గురించి సకాలంలో ఫిర్యాదు చేయకుండా అడ్డుకుంటాయని, న్యాయక్రమంలో అడ్డంకులను పెంచుతాయని మహిళా నేతలుల పేర్కొన్నారు. పైగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా, కఠోర శ్రమతో సాధించుకున్న మహిళల హక్కులను కాలరాసేలా అదనపు సెషన్స్ న్యాయమూర్తి వ్యవహరించారు. క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా లైంగికదాడి బాధితురాలిని అవమానించే రీతిలో ప్రశ్నలు అడగరాదని నిబంధనలు పేర్కొంటున్నాయి. పైగా ఆ మేరకు సుప్రీం తీర్పులు కూడా వున్నాయి. పైగా, పవిత్రమైన స్త్రీకి సాంప్రదాయ, పితృస్వామ్య సమాజం ఇచ్చే నిర్వచనాలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఒక మహిళ గౌరవం, గోప్యత, శారీరక సమగ్రతలకే ప్రాధాన్యతనిచ్చింది. కానీ ఈ కేసులో మపుసా సెషన్స్ కోర్టు తీర్పులో ఈ అంశాలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. లింగ పరమైన సున్నిత అంశాలే కాకుండా మొత్తంగా గతంలో అనుసరించిన, అమలు చేసిన సాంప్రదా యాలన్నింటినీ తుడిచిపెట్టారని విమర్శించారు.