Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
- కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం విఫలం
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా సమస్యలపై పోరాటాలే కాదు.. ఆపద కాలంలో ప్రజలకు సేవ చేయడంలోనూ తమ పార్టీ ముందు వరుసలో ఉంటుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నర్సింహారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాన్ని గురువారం రాఘవులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐసోలేషన్ కేంద్రంలో సకల సదుపాయాలతో జబ్బు నయం అయ్యే వరకు వసతి కల్పిస్తారన్నారు. నిరంతరం వైద్య సిబ్బంది పరిశీలన, ఉచితంగా మందులు, పౌష్టికాహారం అందించనున్నట్టు చెప్పారు. మానసికంగా కుంగిపోయే కరోనా బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలు కొనసాగుతున్నాయని, హైదరాబాద్‌లోని ఎస్వీకేలో సెంటర్ విజయవంతంగా నడుస్తుందని చెప్పారు.
కరోనా బాధితుల కోసం తమ కార్యాలయాలను ప్రభుత్వానికి అప్పగిస్తామని ప్రకటించినా స్పందన లేదన్నారు. ఇంట్లో అందరికీ కరోనా వచ్చి వంట చేసుకోవడానికి ఇబ్బంది ఉంటే ఇక్కడి నుంచి పౌష్టికాహారం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుత విపత్తుకు తగ్గట్టుగా తమ ఒక్కరి సేవలే సరిపోవని, అన్ని రాజకీయ పార్టీలూ ముందుకు రావాలని కోరారు.
కేరళ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసేందుకు స్థానిక సంస్థలకు అవసరమైన సౌకర్యాలు ఆ ప్రభుత్వం కల్పించిందని, అదే మాదిరిగా ఇక్కడి ప్రభుత్వ కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా రెండో వేవ్‌తో ఆగిపోయే పరిస్థితి కనిపించడం లేదన్నారు. 80 నుంచి 90 శాతం మందికి వ్యాక్సిన్ వేస్తే ఆగిపోయే పరిస్థితి వచ్చేలా ఉందని, కానీ నాలుగు నెలలుగా నాలుగు కోట్ల మందికే పూర్తిగా వ్యాక్సిన్ వేసిన ప్రభుత్వాలు 135 కోట్ల మందికి వేయాలంటే ఎంత కాలం పడుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కరోనా విపత్తును ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదన్నారు. వ్యాక్సిన్ విధానంపై ఢిల్లీ, పశ్చిమబెంగాల్ సీఎంలు కేంద్రాన్ని నిలదీస్తున్నారని, వారితో తెలంగాణ, ఏపీ సీఎంలు కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్ గ్రామ స్థాయికి వ్యాప్తి చెందిందని, దాని వల్ల మరణాలు కూడా పెరిగాయని అన్నారు. బాధితులకు వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటికే 15 హైల్ప్‌లైన్ కేంద్రాలను నడుపుతున్నామని చెప్పారు.అంతకు ముందు రాఘవులు నల్లగొండ మండలం ఆర్జాలబావి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలి ంచారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పార్టీ కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, నాయకులు నారి అయిలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ఎమ్‌డి.సలీం, సయ్యద్ హాషం, పి.నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, ఐద్వా నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి పాల్గొన్నారు.