Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1000 మంది పురుషులకు 867 మంది స్త్రీలకు వ్యాక్సిన్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16న ప్రారంభమైంది. జూన్ 2 నాటికి 21,85,46,667 డోసులు ఇవ్వగా.. ఇందులో మొదటి డోసు, రెండు డోసులు ఉన్నాయి. అయితే, వ్యాక్సినేషన్ గణాంకాలను గమనిస్తే.. మహిళల కంటే పురుషులకే అధికంగా టీకాలు ఇవ్వబడ్డాయి. కనీసం ఒక డోసు తీసుకున్న పురుషుల సంఖ్య మహిళల సంఖ్య కంటే 15 శాతం ఎక్కువ. అంటే ప్రతి 1000 మంది పురుషులకు టీకాలు వేయగా.. అదే టైంలో కేవలం 867 మంది మహిళలకు టీకాలు వేశారు. ఈ నిష్పత్తి జాతీయ లింగ నిష్పత్తి కంటే తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్ లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారు. జూన్ 2 నాటికి కరోనా టీకాలు వేసిన పురుషుల సంఖ్య 9,13,81,749కాగా, 7,92,31,870 మంది మహిళల్లో కనీసం ఒక డోసు తీసుకున్నవారు ఉన్నారు.
మొత్తంగా టీకాలు తీసుకున్న వారిలో 53 శాతం మంది పురుషులు ఉన్నారు. ఇక ఛత్తీస్‌గఢ్, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో మాత్రం పురుషుల కంటే స్త్రీలకు అధికంగా టీకాలు వేశారు. దేశంలో అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన కేరళ.. తన మహిళా జనాభాకు టీకాలు వేయడంలో అత్యుత్తమ పనితీరును కనబర్చింది. ఇక్కడ 1000 పురుషులకు టీకాలు వేయగా.. 1,125 మంది మహిళలకు టీకాలు అందించారు.
ఇక ఢిల్లీ, యూపీ, జమ్మూకాశ్మీర్, పంజాబ్‌లలో వ్యాక్సినేషన్ లింగ అంతరం అధికంగా ఉంది. 45ప్లస్ జనాభాలో 67 శాతం మందికి టీకాలు వేసి ప్రశంసలు పొందిన జమ్మూకాశ్మీర్‌లో వ్యాక్సినేషన్ లింగ వ్యత్యాసం అధికంగా ఉంది. అక్కడ టీకా తీసుకున్న 1000 మంది పురుషులకు కేవలం 709 మంది మహిళలకు మాత్రమే టీకాలు వేశారు. దీని తర్వాత నాగాలాండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి.