Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో స్థానంలో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్
- మూడో స్థానంలో ఏపీ, గోవా, కర్నాటక, ఉత్తరాఖండ్
- ఆరోస్థానంలో తెలంగాణ.. చివరిలో బీహార్, ఉత్తరప్రదేశ్, అసోం
- భారత్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై నిటి ఆయోగ్ నివేదిక
న్యూఢిల్లీ : సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. నిటి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదికలో కేరళ తొలి స్థానంలో కొనసాగగా.. బీహార్ చివరి స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో రెండో స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్నాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మూడో స్థానంలోనూ నిలిచాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ తొలిస్థానంలో నిలిచింది. చివరి స్థానంలో దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ నిలిచాయి. భారత్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆయా ప్రభుత్వాల పనితీరును పర్యవేక్షిస్తున్న నిటి ఆయోగ్, ప్రతిఏటా నివేదిక విడుదల చేస్తుంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకొని నిటి ఆయోగ్ ఈ ర్యాంకులను కేటాయిస్తుంది. 2018 నుంచి వీటిని ప్రకటిస్తుండగా తాజాగా మూడో ఎడిషన్ను నిటి ఆయోగ్ ప్రకటించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీ 2020-21 నివేదికను గురువారం నాడిక్కడ నిటి ఆయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్ తాజాగా విడుదల చేశారు. ఆయనతో పాటు నిటి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, నిటి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్య విభాగం) వినోద్ పాల్, నిటి ఆయోగ్ సలహాదారు (ఏస్డీజీ) సంయుక్త సమద్దార్ ఉన్నారు.
నిటి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో 75 స్కోరుతో కేరళ తొలి స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోగా 74 స్కోరుతో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు రెండో స్థానంలో నిలిచాయి. 73 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్, గోవా, కర్నాటక, ఉత్తరాఖండ్ మూడో స్థానంలో నిలిచాయి. 71 పాయింట్లతో సిక్కిం నాలుగో స్థానం, 70 పాయింట్లతో మహారాష్ట్ర ఐదో స్థానంలో నిలిచాయి. తెలంగాణ 69 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది.
చిట్ట చివర బీహార్
ఇక ఈ ఏడాది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో బీహార్ అత్యంత పేలవ మైన పనితీరు కనబరిచింది. 52 పాయింట్లతో బీహార్ ఆఖరి స్థానంలో నిలిచింది. బీహార్ తో పాటు జార్ఖండ్, అసోం, ఉత్తరప్రదేశ్, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, నాగాలాండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు చివరి స్థానాల్లో నిలిచాయి.
కేంద్ర పాలితాల్లో చండీగఢ్
ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్ తొలి స్థానంలో నిలిచింది. చివరి స్థానంలో దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ నిలిచింది. 79 పాయింట్లతో చండీగఢ్ మొదటి స్థానంలో నిలవగా, 68 పాయింట్లతో ఢిల్లీ, పుదుచ్చేరి, లక్షదీప్ లు రెండో స్థానంలో నిలిచాయి. 67 పాయింట్లతో అండమాన్ నికోబార్ దీవులు మూడో స్థానంలోనూ, 66 పాయింట్లతో జమ్మూ కాశ్మీర్ నాలుగో స్థానంలోనూ నిలిచాయి. 62 పాయింట్లతో దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ చివరి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా నిటి ఆయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్ దేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతిని పర్యవేక్షించడానికి ఈ సూచీలు ప్రాథమిక సాధనంగా మారాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలాంటి ర్యాంకులను ఇవ్వడం ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య పోటీని ప్రోత్సహించేందుకు దోహదపడుతుందని అభిప్రాయప డ్డారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఈ సూచీల ద్వారా పర్యవేక్షించే ప్రయత్నం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని స్పష్టం చేశారు. ఎస్డీజీ ఇండియా ఇండెక్స్, డ్యాష్ బోర్డు ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పర్యవేక్షించేందుకు తాము చేసిన కృషి విస్తత స్థాయిలో గుర్తింపు పొందుతూనే ఉందన్నారు. సుస్థిర అభివద్ధిపై అంతర్జాతీయ స్థాయిలో జరిగే పర్యవేక్షణా కషికి ఇది దోహదపడగలదని తాము విశ్వసిస్తూ ఉన్నామన్నారు. నిటి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ 2030 సంవత్సరపు ఎజెండాను సాధించేందుకు తాము జరిపే ప్రయాణంలో ఇంకా మూడింట ఒక వంతు మిగిలి ఉండగానే, ఈ మూడో సూచీ ఎన్నో ప్రత్యేకతలు సాధించిందనీ, సుస్థిర అభివద్ధి ప్రాధాన్యత, భాగస్వామ్యంపై ఈ నివేదిక దృష్టిని కేంద్రీకరించిందని అన్నారు.