Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేలో వైరస్ బారిన పడి 17మృతి
న్యూఢిల్లీ : కరోనా రెండో వేవ్ అన్ని రంగాలనూ అతలాకుతలం చేస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకూ ఇండియా, ఇండిగో, విస్తారా సంస్థలకు చెందిన దాదాపు 17మంది విమాన పైలట్లు ఒక్క మే నెలలోనే వైరస్ సోకి మృత్యువాత పడ్డారని తెలిసింది. మరణించినవారిలో ఇండిగోకు చెందిన 10మంది, విస్తారాకు చెందిన ఇద్దరు పైలట్లు ఉన్నారని విమానయాన అధికారులు మీడియాకు తెలిపారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఐదుగురు సీనియర్ పైలట్లు కేప్టెన్ హర్ష తివారీ, జి.పి.ఎస్.గిల్, ప్రసాద్ కర్మాకర్, సందీప్ రానా, అమితేష్ ప్రసాద్‌లు కరోనా వైరస్‌తో మరణించారని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు తెలిపారు.
బాధిత కుటుంబాలకు రూ.5కోట్లు నష్టపరిహారంగా అందజేశామని ఇండిగో వర్గాలు మీడియాకు తెలిపాయి. ఎంతమందికి వైరస్ సోకింది, ఎంతమంది పైలట్ల మరణించారు? అనే సమాచారాన్ని విమానయాన సంస్థలు అధికారికంగా వెల్లడించటం లేదు. ఇక వాక్సినేషన్ విషయానికొస్తే, విస్తారా, ఎయిర్ ఏసియాలలో పనిచేస్తున్న సిబ్బందిలో 99శాతం మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ జరిగినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ కొరత కారణంగా ఎయిర్ ఇండియాలో చాలా ఆలస్యంగా వాక్సినేషన్ ప్రక్రియ మొదలైందని, మే 15 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. వైరస్బారినపడే అవకాశం ఎక్కువగా ఉన్న ఉద్యోగులుగా తమను గుర్తించి, సిబ్బంది అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని ఈనెల 4న ఎయిర్ ఇండియా ఉద్యోగులు తమ ఆందోళన వ్యక్తం చేశారు.
కోవిడ్‌బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని గతకొన్నాండ్లుగా పైలట్ల సంఘం వ్యాక్సిన్ కోసం డిమాండ్ చేస్తోంది. అయినప్పటికీ వ్యాక్సిన్ అందుబాటులో లేక పంపిణీ చేయలేకపోయామని ఎయిర్ ఇండియా అధికారులు తెలుపుతున్నారు. వ్యాక్సినేషన్ క్యాంపులు ఏర్పాటుచేసుకున్నాక కూడా సరిపోయినన్ని టీకాలు రాక కార్యక్రమం రద్దు చేసుకున్న ఘటనలు అనేకమున్నాయని వారు చెప్పారు.