Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో గ్రామస్థుల ఆరోపణ
శ్రీనగర్ : ఒక ముస్లిం యువకుడి అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు 8 మంది అమాయకులపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసిన ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది. గతవారం జరిగిన యువకుడి అంత్యక్రియల్లో కేవలం మత నినాదాలు చేసినందుకే 8 మందిపై అన్యాయంగా తీవ్రమైన ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే జిల్లాలోని బుమ్హామా గ్రామంలో మే 28న మహమ్మద్ అమిన్ దార్ తన నివాసానికి సమీపంలో ఒక వాహనం ఢ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకుని వెళుతుంటే మార్గ మధ్యలోనే మరణించాడు. దీంతో తరువాత రోజు ఉదయమే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ అంత్యక్రియల కార్యక్రమంలో దేశవ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు 8 మంది యువకులపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరిలో కొంత మందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయిజ్ అహ్మద్, అబిద్ హుస్సైన్ మీర్, ఖైసర్ అహ్మద్ మీర్, బిలాల్ అహమ్మద్ మీర్, అబ్బాస్ అహ్మద్ మీర్, ఫిర్దోస్ అహ్మద్ భట్, ఫయాజ్ అహ్మద్ దర్ ఉపా కేసులు నమోదు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. యువకుడి అంత్యక్రియల్లో మత నినాదాలు మినహా దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదని గ్రామ సర్పంచ్ నజీర్ దార్తో సహా స్థానికులు చెబుతున్నారు. అలాగే కేసు నమోదు చేయబడ్డ అయిజ్ అహ్మద్ అసలు ఈ అంత్యక్రియల్లోనే పాల్గొనలేదని, హంద్వారా ప్రాంతంలో జరిగిన మరొక బంధువు అంత్యక్రియల్లో పాల్గొన్నడని అతని తండ్రి చెబుతున్నాడు. అయినా పోలీసులు ఈ కేసులో ముందుకే వెళుతున్నారు. మరోవైపు కుప్వారా ఎస్ఎస్పి సుందీప్ చక్రవర్తి ఈ సంఘటనపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు.