Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యజ్ఞం తొమ్మిది కథలకు కేంద్ర సాహిత్య అవార్డు
శ్రీకాకుళం : కథల మాస్టారు తెలుగు సాహితీ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు(97) కన్నుమూశారు. వయోభారంతో శ్రీకాకుళంలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. 1924 నవంబరు 9న లావేరు మండలం మురపాకలో జన్మించిన కాళీపట్నం వెంకట సూర్య రామ సుబ్రమణ్వేశ్వరరావు.. కారా మాస్టారుగా, కథల మాస్టారుగా గుర్తింపు పొందారు. శ్రీకాకుళంలో కథానిలయాన్ని స్థాపించారు. రచనలకు గాను పలు కేంద్ర, రాష్ట్ర అవార్డులు పొందారు. వివిధ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వత్తిరీత్యా ఉపాధ్యా యులైనా రచనా శైలి సరళంగా ఉంటుంది. మురపాకలోనే ప్రాథమిక విద్యాభ్యాసం ముగిసిన తర్వాత.. పదో తరగతి వరకు శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో పూర్తిచేశారు. అనారోగ్యం కారణం వల్ల చదువు సాగలేదు. తిరిగి స్వగ్రామం చేరుకుని అక్కడ రామకృష్ణ గ్రంథాలయంలో పుస్తకాలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఆరోజుల్లోనే తొలిసారిగా రచనలు చేసే యత్నం చేశారు. ముద్దు అనే కథ, ఒకటి రెండు పద్యాలు రాసినప్పటికీ అవి ఎక్కడా ప్రచురణ కాలేదు. తిరిగి శ్రీకాకుళం చేరుకుని ఆయన ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు.1946 మార్చి 19న సీతామహాలక్ష్మితో ఆయనకు వివాహం జరిగింది. ఆ తర్వాత భీమునిపట్నంలో సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్‌ను పూర్తి చేసి 1948 జూన్‌లో విశాఖ సెయింట్ ఆంథోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1979లో పదవీ విరమణ చేశారు. కారా మాస్టారు తొలిసారిగా రాసిన కథ ఫ్లాటు ఫారామోను 1943లో చిత్రగుప్త పత్రికలో ప్రచురితమైంది. 'తదుపరి వీనంలో అయితే గియితే', 'భయిజాన్', 'వెళ్లిపో యింది', 'వెనుక చూపు నిజమే' అయితే వంటి పలు కథల ప్రస్థానాన్ని కొనసాగించారు. 'నేనెందుకు రాసాను వ్యాసం', 'తీర్పు', 'ఇల్లు', 'యజ్ఞం' వంటి కథలు కారా మాస్టారుకు మంచి గుర్తింపు తెచ్చాయి. 1964లో యువ పత్రికలో 'తీర్పు' కథ వెలువడటంతో మాస్టారు కథా రచన తిరిగి ప్రారంభమైంది. 1966లో 'యజ్ఞం' కథతో తెలుగు కథ సాహిత్యంలో ప్రత్యేక ముద్ర వేశారు. 1967-70 కాలంలో వీరుడు-మహావీరడు మొదలు.. భయం వరకు ఏడు కథలు ప్రచురించారు. విరసంలో సభ్యుడిగా ఉంటున్న సమ యం లోనే 1970-72 మధ్యలో శాంతి, చావు, జీవధార, కుట్ర మొదలైన కథల్లో వ్యవస్థలోని లోపాలను చక్కగా చూపా రు.1971 జనవరి 31న విశాఖలో యజ్ఞం కథా సంపుటిని మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించారు. అదే సమ యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించగా దానిని ఆయన అప్పట్లో తిరస్కరించారు. కారా మాస్టారు కొంతమంది మిత్రులతో కలిసి కథా వేదికను ఏర్పాటు చేశారు. అప్పడే ఆంధ్రభూమి దినపత్రికలో నేటి కథ శీర్షిక నిర్వహిస్తూ ఎందరో యువ రచయితలను ప్రోత్స హించారు. తిరిగి 1996 యజ్ఞంతో తొమ్మిది కథలు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందు కున్నారు.
కారా మరణం పట్ల సీఎం సంతాపం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు (కారా) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. సామాన్యుల జీవితాల్లోని వ్యక్తిగత, సామాజిక పార్శ్వాలను తన కథల ద్వారా విభిన్నంగా స్పృశించిన ఆయన గొప్ప రచయిత అని పేర్కొన్నారు. కారా కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలుగు కథకు తీరని లోటు : తెలంగాణ సాహితి
కారా మాస్టారుగా పేరొందిన కాళీపట్నం రామారావు మరణం తెలుగు కథాసాహిత్యానికి తీరని లోటు అని తెలంగాణ సాహితి పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్దన, కె.ఆనందాచారి ఒక ప్రకటనలో తెలిపారు. కారా మాస్టారు'కథా నిలయం' సంస్థను స్థాపించి సాహితీర ంగానికి ఎనలేని సేవ చేశారని తెలిపారు. కారా మాస్టారు కథల్లో యజ్ఞం, చావులాంటి కథలు దేశంలోని అన్ని భాషల్లో అనువాదమై, ప్రఖ్యాతిగాంచాయని అన్నారు. కారా మాస్టారి కుటుంబ సభ్యులకు తెలంగాణ సాహితి తరఫున సానుభూతిని తెలిపారు.