Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు నల్ల చట్టాల కాపీలు దహనం
- బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద ఆందోళనలు
- సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
న్యూఢిల్లీ : మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు నేడు (శనివారం) సంపూర్ణ క్రాంతి దివస్ కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు నిచ్చింది. ఈ సందర్భంగా మూడు రైతు వ్యతిరేక చట్టాల కాపీలు దహనం చేయాలని పిలుపునిచ్చింది. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ చట్టాలకు సంబంధించిన ఆర్డినెన్సులను జారీ చేసి, ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తమ నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) మీడియా ఇన్చార్జి ధర్మేంద్ర మాలిక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల నకలు కాపీలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాల వద్ద తగలబెట్టనున్నట్టు ధర్మేంద్ర తెలిపారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు లేని జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద తమ నిరసనను తెలియజేస్తామన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో 2020 నవంబరు నుంచి నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
2024లోపు నల్ల చట్టాలు వెనక్కే :రాకేశ్ తికాయత్
మూడు వ్యవసాయ చట్టాలను 2024లోపు కేంద్రం ఉపసంహరించుకుంటుందని రైతునేత రాకేశ్ తికాయత్ అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలపై, రైతుల ఆందోళనపై ఆయనకు పలు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''2024 నాటికి ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటుంది. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది. అప్పటికి దేశంలో ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే ఈ వ్యవసాయ చట్టాలు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏ)కు పెద్ద ఆటంకిగా మారాయి. వీటిని కొనసాగిస్తే వారికి చాలా నష్టం'' అని అన్నారు.
''వాళ్లు ఎందుకు ఉపసంహరించుకోరు? అలా అనుకోవడానికి బలమైన కారణం ఏదైనా ఉందా? సెప్టెంబర్‌లో చట్టంగా మారి ఇప్పటికీ అమలు కాలేదు. ఇంకో ఏడాది పాటు కూడా అమలు చేయ మని చెప్పారు. ఇక ఎప్పటికీ అమలు కాదు'' అని అన్నారు. ఇక, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్ సంభాషణ గురించి స్పందిస్తూ ''నిజమే.. యూపీలోని చెరకు రైతు సమస్యల గురించి మాట్లా డాను. కొన్ని ప్రాంతాల్లో చెరకుకు కేవలం రూ. 23 వేలు మాత్రమే ఇస్తున్నారు. దానిపై చర్యలు తీసుకో వాలని చెప్పాను'' అని రాకేశ్ తికాయత్ అన్నారు.
189వ రోజూ ఆందోళన
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం శుక్రవారం నాటికి 189వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం అవుతున్నారు. హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీ సరిహద్దులకు వేలాది మంది రైతులు తరలి వస్తున్నారు.