Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరిగిన ఇంధనధరలు
- లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, డీజీల్‌పై 28 పైసలు పెంపు
- ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 101 కి చేరిన వైనం
న్యూఢిల్లీ : చమురు ధరలు దేశంలోని వాహనదారులకు సెగలు పుట్టిస్తున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత దేశంలో మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ. 101 మార్కుకు చేరుకున్నది. ఇక లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, డీజీల్‌పై 28 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు నిర్ణయించాయి. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో ధరలు ఆకాశాన్నంటాయి. దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.76, డీజీల్ ధర రూ. 85.66గా నమోదైంది. ఇక ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.98, డీజీల్ ధర రూ. 92.99కు ఎగబాకాయి. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.23కు, డీజీల్ ధర రూ. 90.38కు పెరిగాయి. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.76, డీజీల్ ధర రూ. 88.51గా రికార్డయి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.48కి ఎగబాకింది. లీటర్ డీజీల్ ధర రూ. 93.38కి పెరిగింది. దేశంలో ఈ విధంగా అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న ఇంధన ధరల విషయంలో మోడీ సర్కారు తీరుపై సాధారణ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్డౌన్, ఆంక్షలు కొనసాగుతున్న ఈ కరోనా కాలంలో ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన సాధారణ, మధ్యతరగతి ప్రజలపై పెట్రో ధరల పెరుగుదల మరో అదనపు భారమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పెరుగుతున్న చమురు ధరల కారణంగా నిత్యవసర ధరలు పెరిగి మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పారు.